బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 నవంబరు 2020 (10:52 IST)

వదల బొమ్మాళి.. వదల : భీష్మించిన ట్రంప్... వత్తాసు పలుకుతున్న జీఎస్ఏ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. 'వదల బొమ్మాళి.. నిను వదల' అన్నట్టుగా వైట్‌హౌస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో అధికార మార్పిడి ప్రక్రియపై ప్రతిష్టంభన నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
సాధారణంగా ఓట్లలెక్కింపు ఓ కొలిక్కి వచ్చాక, అమెరికా సాధారణ సేవల పాలనా విభాగం (జీఎస్ఏ) ప్రకటనతో అధికార మార్పిడి ప్రక్రియ మొదలవుతుంది. అయితే జో బైడెన్‌ గెలిచి 48 గంటలు గడుస్తున్నా, జీఎస్ఏ చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎమిలీ మర్ఫీ మాత్రం స్పందించడం లేదు. 
 
ఎమిలీ... డొనాల్డ్‌ ట్రంప్‌ నియమించిన అధికారిణి. అధికార మార్పిడికి సంబంధించి ఆమె బైడెన్‌ బృందానికి 9.9 మిలియన్‌ డాలర్ల నిధుల్ని విడుదల చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలను ఈ బృందానికి అందుబాటులోకి తెస్తుంది. తద్వారా అధికార యంత్రాంగం ఇకమీదట బైడెన్‌ బృంద సూచనలకు అనుగుణంగా వెళ్లాల్సి ఉంటుంది.
 
అయితే జీఎస్ఏ - బైడెన్‌ బృందానికి ఆఫీసును, అవసరమైన ఇతర లాజిస్టిక్స్‌ను సమకూర్చినా, వీరి జీతాలకు, రవాణా ఖర్చులకు అవసరమైన 9.9 మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని విడుదల చేయలేదు. నిధులు, అధికార యంత్రాంగ అప్పగింతకు వీలుకల్పించే పత్రాలపై ఎమిలీ సోమవారం దాకా సంతకం చేయలేదు. దీంతో ఆమె తీరుపై విమర్శలు రేగాయి. జీఎస్ఏ అధికారులెవరూ బైడెన్‌ బృందంతో అసలు మాట్లాడరాదన్న ఆదేశాలు వచ్చాయని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.
 
జీఎస్ఏ తీరును చూశాక బైడెన్‌ తనంత తానుగానే చర్యలు మొదలుపెట్టేశారు. ఎన్నికల హామీకి అనుగుణంగా కొవిడ్‌ కట్టడిపై ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశారు. 13 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, డాక్టర్లతో కూడిన ఈ టాస్క్‌ఫోర్స్‌కు సుప్రసిద్ధ భారతీయ అమెరికన్‌ వైద్యుడు వివేక్‌ మూర్తి నేతృత్వం వహిస్తున్నారు.