శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 25 ఫిబ్రవరి 2017 (04:10 IST)

ఒకరిని కాపాడేందుకు తన ప్రాణాన్ని లెక్కించని ఆ మనీషి రక్తమేది? నలుపో తెలుపో తెలుసా ట్రంప్?

ఒక అమెరికన్‌ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్‌ మానవత్వంతో దుండగుడిని అడ్డుకున్న ఘటన విద్వేష రాజకీయాలు అలుముకుంటున్న ప్రతిచోటా మానవతకు నిలువెత్తు ప్రమాణందా నిలుస్తోంది.

ఒక అమెరికన్‌ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్‌ మానవత్వంతో దుండగుడిని అడ్డుకున్న ఘటన విద్వేష రాజకీయాలు అలుముకుంటున్న ప్రతిచోటా మానవతకు నిలువెత్తు ప్రమాణందా నిలుస్తోంది. చేస్తున్న ఉద్యోగం కోల్పోయి, మరో ఉద్యోగం దొరకని నిస్పృహ పరాకాష్టకు చేరిన ఆవేశపరుడు తుపాకి ఎత్తి రంగుభేదమున్న ఎదుటి వారిని టపాటపా కాల్చితే..రంగుభేదాలు పట్టించుకోని మరొక శ్వేత జాతీయుడు ప్రాణాలు పణంగా పెట్టి సాయుధుడిని అడ్డుకుని గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స ముగిసిన తర్వాత ఆ అమెరికన్ చెప్పిన మాటలు యావత్ ప్రపంచానికి కాంతిరేఖలను వెదజల్లుతున్నాయి. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’  ఇదీ ఆ మనీషి సమాధానం. 
 
అమెరికాలో కాల్పులు జరిపి తెలుగు యువకుడిని పొట్టన బెట్టుకున్న పూరింటన్‌ను ప్రాణాలకు తెగించి అడ్డుకున్న 24 ఏళ్ల అమెరికన్‌ యువకుడు ఇయాన్‌ గ్రిలట్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. ఒక అమెరికన్‌ జాతి విద్వేషంతో కాల్పులు జరపగా.. మరో అమెరికన్‌ మానవత్వంతో అడ్డుకోవడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. పూరింటన్‌ కాల్పులు మొదలుపెట్టడంతో టేబుల్‌ వెనక దాక్కున్న గ్రిలట్‌.. ఒక్కసారిగా విసురుగా వెళ్లి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడు అతడిపైనా కాల్పులు జరపడంతో.. గ్రిలట్‌ చేతి గుండా ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో గ్రిలట్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కన్సాస్‌ హెల్త్‌ సిస్టమ్‌ ఇంటర్వూ్య చేసింది. అందు లో.. ‘సాటి మనిషి కోసం నేనేం చేయాలో అదే చేశాను. అతడు (బాధితుడు) ఎక్కడి వాడు, ఏ జాతి వాడదన్నది ముఖ్యం కాదు. మనమంతా మనుషులం. దుండగుడు మరొకరి వైపు వెళ్లకుండా ఏం చేయాలో అది చేశాను’ అని గ్రిలట్‌ పేర్కొన్నారు.
 
అలోక్ రెడ్డి తండ్రి అంతర్మధనం
‘‘అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా కలసికట్టుగా ఉండాలి. అమెరికా వాళ్లు పిచ్చివాళ్లలా మారిపోతున్నారు. ఏ విషయమైనా వారితో వాదించవద్దు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలతోనే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. భారత యువత పునరాలోచన చేసుకుని స్వదేశానికి తిరిగి రావాలి..’’  ఇది అమెరికా బార్లో కాల్పులకు గురై తృటిలో తప్పించుకున్న హైదరాబాద్ వాసి అలోక్ రెడ్డి తండ్రి జగన్ మోహన్ రెడ్డి అత్మ వేదన. బిడ్డల వృద్ధిని అమెరికా సాక్షిగా చూసి సంతసిస్తున్న తల్లిదండ్రులు అక్కడినుంచి వస్తున్న శవపేటికల్లో తన బిడ్డలను చూడాల్సిన పాడు కాలం ఉండకూడదంటే ఏం చేయాలి? ఇది ప్రభుత్వాల స్థాయిలో అయ్యే పరిష్కారం కాదు. 
 
అమెరికాలో బార్లకు పోకుండా, పార్కులకు పోకుండా, జనం గుమికూడే ప్రాంతాలకు పోకుండా ఇల్లు, ఆఫీసు తప్ప మరే స్థలలోనూ అడుగుపెట్టకుండా గుట్టుగా, మట్టుగా భారతీయులు జీవిస్తే ఇలాంటి ప్రమాదాలు ఉండవని కొందరు సలహా చెబుతున్నారు. ఇదే సరైందైతే, మనిషి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రహస్య జీవితం గడిపితేనే నిలబడతాయనుకుంటే అప్పుడు అలాంటి గడ్డను అమెరికా అని భూతల స్వర్గం అని పిలవకూడదు. చరిత్రలో హిట్లర్ నెలకొల్పిన రెండో వివక్షా రాజ్యంగా పేరు పెడితే బాగుంటుంది. ఇలాంటి స్థితికి జీవితం చేరుకన్నాక ఆ గడ్డమీదే బతుకు కడతేర్చుకోవాలా లేదా అని నిర్ణయించుకోవలసిన స్వేచ్ఛ మటుకు మన వారిదే. మన పిల్లలదే..