బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (19:35 IST)

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ప్రపంచ యుద్ధం-3లో అణ్వాయుధాల దాడి వుంటుందన్న రష్యా విదేశాంగ మంత్రి

మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే కనుక అది అణ్వాయుధాల దాడితో నిండి వుంటుందని, ఆ దాడి వినాశకరమైనదనీ, విధ్వంసకరమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ బుధవారం అన్నారు. ఈ మేరకు ఆయన రియా వార్తా సంస్థతో చెప్పినట్లు వెల్లడైంది.

 
గత వారం ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన రష్యా, ఉక్రెయిన్ అణ్వాయుధాలను కొనుగోలు చేస్తే మాత్రం అసలైన విధ్వంసం ఏమిటో చూపిస్తామని చెప్పారు. మరోవైపు వందలాది యుద్ధ శకటాలతో రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌కు మరింత దగ్గరగా వెళుతున్నాయి. తమ రాజధాని నగరం వైపు వస్తున్న రష్యా సైన్యాన్ని చూసి తాము బెదిరేది లేదనీ, రష్యాకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా వున్నామనీ, అందుకోసం కీవ్ రాజధాని నుంచి ఎదురుచూస్తున్నామని, తమ రాజధానిని కాపాడుకుంటామని ఉక్రేనియన్ రాజధాని మేయర్ విటాలి క్లిట్ష్కో బుధవారం ఆన్‌లైన్ పోస్ట్‌లో రాశారు.

రాయిటర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరు రోజుల యుద్ధంలో దాదాపు ఆరువేల మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌లో రష్యా వైమానిక దళాలు దిగడం,దక్షిణ నగరమైన ఖేర్సన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యన్ మిలిటరీ చేస్తున్న వాదనలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు.

రష్యా భారీ మూల్యం చెల్లించక తప్పదు
అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ ఉక్రెయిన్‌కు తమ పూర్తి మద్దతు వుంటుందని పునరుద్ఘాటించారు. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తరపున ఆ దేశ భూభాగంపై రష్యాతో తలపడబోమని చెప్పారు. తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో దేశ భూభాగాలను రక్షిస్తుందని ఆయన చెప్పారు. 

 
అమెరికాతో పాటు మిత్ర దేశాల భూభాగంలోని ప్రతి అంగుళాన్ని సమిష్టి శక్తితో రక్షిస్తుందని పేర్కొన్నారు. ఉక్రేనియన్లు గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని కొనియాడారు. పుతిన్ యుద్ధభూమిలో లాభాలు పొందవచ్చు, కానీ దీర్ఘకాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.