శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (09:52 IST)

ఏ క్షణంలోనైనా అణుదాడికి సిద్ధం: రష్యా అణుజలాంతర్గాముల విన్యాసాలు

రష్యా మరింత దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై పలు రకాల ఆంక్షలు విధించి ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఉక్రెయిన్ దేశంపైన విరుచుకుపడుతోంది. ఐతే ఉక్రెయిన్ సైనికులు, పౌరులు వీరోచితంగా పోరాడుతున్నారు. రష్యా దళాలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. రోడ్లపై సైనిక శకటాలకు అడ్డంగా పడుకుంటున్నారు. దీనితో విచక్షణ కోల్పోతున్న రష్యా దళాలు ప్రజలపై కాల్పులు జరుపుతున్నారు.

 
మరోవైపు యుద్ధంలో రష్యా సైనికులు కొందరు తీవ్ర వేదనను వెలిబుచ్చుతున్నారు. ఈ యుద్ధం చేయలేమనీ, అమాయక ప్రజలను చంపాల్సి వస్తుందనీ, ఇంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని భావిస్తున్నట్లు ఓ రష్యా సైనికుడు తన తల్లికి సందేశం పంపడం చూస్తుంటే ఉక్రెయిన్ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

 
స్వదేశంలో ఉక్రెయిన్ పైన యుద్ధం వద్దని వారిస్తున్నప్పటికీ పుతిన్ ఎంతమాత్రం పట్టించుకోవడంలేదు. సైనిక దళాలను తిప్పికొడుతున్న ఉక్రెయిన్ దేశంపైన అణుదాడికి దిగాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే ప్రపంచ పరిస్థితులు తీవ్ర సంక్షోభంలో పడిపోతాయి. ఎందుకంటే ఒక దేశం అణుదాడికి దిగితే మరో దేశం ఆ దాడిని చూస్తూ కూర్చోదు. అణుదాడి విధ్వంసం సృష్టిస్తుంది. మానవాళికి పెనుముప్పు కలిగిస్తుంది. ఈ దాడి ఎట్టి పరిస్థితుల్లోనూ వాంఛనీయం కాదు. కానీ రష్యా మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది.

తమ దేశ అణు జలాంతర్గాములను బేరెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించి విన్యాసాలు చేయిస్తోంది. ఏ క్షణంలోనైనా అణుదాడికి సిద్ధంగా వుండాలని పుతిన్ ఆదేశించిన నేపధ్యంలో ఈ ఫీట్లు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. సైబీరియాలోని ఇర్కుత్స్క్ ప్రాంతంలోని అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను, సైనిక బలగాలను తరలించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొని మరింత ఆందోళనకు గురిచేసింది.

 
అమెరికా-రష్యాల వద్ద అత్యధిక సంఖ్యలో అణ్వాయుధ సంపత్తి వున్నది. ఈ రెండు దేశాల్లో ఏ దేశం అణుదాడికి దిగినా రెండో దేశం ఎదురుదాడికి దిగడం అనివార్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఎటువైపు వెళుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.