బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (21:54 IST)

పుతిన్ లెక్క తప్పింది.. తోకముడుచుకోవడం బెస్ట్ : బ్రిటన్ ప్రధాని

ఉక్రెయిన్ దేశంపై పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ లెక్క తప్పిందని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా పుతిన్ దాడి చేయాలన్న నిర్ణయం తీసుకోవడంపై నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, పలు పాశ్చాత్య దేశాలు మండిపడుతున్నారు. మరికొన్ని దేశాలు పుతిన్ వైఖరిపై తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నాయి.
 
ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ, ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ముందు పుతిన్ వేసుకున్న లెక్కలన్నీ తప్పాయన్నారు. భారీ ఆయుధ సంపత్తి కలిగిన రష్యా దండెత్తితో ఉక్రెయిన్ సులభంగానే లొంగిపోతుందని పుతిన్ భావించారన్నారు. కానీ పుతిన్ అనుకున్నది ఒకటైతే.. జరుగుతున్నది మరొకటి అని అన్నారు. 
 
రష్యా బలగాలను ఉక్రెయిన్ బలగాలు, ప్రజలంతా కలిసి సమర్థంగా తిప్పికొడుతున్నాయన్నారు. ఉక్రెయిన్ నుంచి ఈ తరహా ప్రతిఘటన వస్తుందని పుతిన కలలో కూడా ఊహించివుండరన్నారు. అదేసమయంలో పాశ్చాత్య దేశాల ఐక్యతను కూడా పుతిన్ చాలా తక్కువగా అంచనా వేశారనీ, ఇపుడు ఆ పాశ్చాత్య దేశాలు విధిస్తున్న వివిధ రకాలైన ఆంక్షలతో పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని జాన్సన్ అభిప్రాయపడ్డారు.