1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (19:44 IST)

ఉక్రెయిన్ సైన్యం కాల్పులు ఆపితే చర్చలకు సిద్ధం : రష్యా విదేశాంగ శాఖ

ఉక్రెయిన్ సైన్యం కాల్పులు ఆపితే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై ప్రపంచ దేశాల విన్నపాలను తోసిపుచ్చి ఏకపక్షంగా ఒంటికాలిపై దండయాత్ర చేసిన రష్యా... రెండో రోజుకే రాజీ మంతనాలకు సంకేతాలు పంపడం గమనార్హం. గురువారం వేకువజాము నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సేనలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌లోని అన్ని సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. కీలకమైన చెర్నోబిల్ అణు స్థావరంతో పాటు స్నేక్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని ప్రభుత్వ భవనాలపై రష్యా పతాకాలను ఎగురవేసింది. ఇంతలోనే రష్యా రాజీ మంతనాలకు ముందుకు వచ్చింది. 
 
అదీ కూడా యుద్ధం ప్రారంభించిన రెండో రోజే అంటే శుక్రవారమే ఈ రాజీ చర్చలకు సిద్ధమని చెప్పడం ప్రారంభించింది. ఈ మేరకు శుక్రవారం రష్యా విదేశాంగ శాఖ మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. తాజాగా నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయమే నేరుగా మరో కీలక ప్రకటన చేసింది. 
 
ఈ ప్రకటనలో తాము ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ సైన్యం కాల్పులు ఆపితేనే ఇది సాధ్యమని రష్యా అధ్యక్ష భవనం తేల్చి చెప్పింది. తాము పెట్టే షరతుకు సమ్మతిస్తే ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తమ బృందాన్ని మిన్‌స్క్‌కు పంపుతామని పుతిన్ కార్యాయం వెల్లడించింది. అయితే, రష్యా చేసిన ప్రకటనలపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.