సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (08:20 IST)

నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను? ఇమ్రాన్ ఖాన్ ఆవేదన

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలిపోయే ప్రమాదం పొంచివుంది. ఆయనకు మద్దతిస్తున్న భాగస్వామ్య్ పార్టీలు ఒక్కొక్కటిగా నిష్క్రమిస్తున్నాయి. దీంతో ఆయన ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. అయితే, ఆయన మాత్రం తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని భీష్మించికూర్చొన్నారు. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన సుధీర్ఘ ప్రసంగం చేశారు. 
 
పాకిస్థాన్ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో ఉందని తెలిపారు. తమ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయని, రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కొన్ని పరిణామాలు చూస్తుంటే నా వంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడా? అనిపిస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
'నాకు దేవుడు డబ్బు, మంచి జీవితంతో పాటు అన్నీ ఇచ్చాడు. అలాంటి జీవితంపై నాకు ఇప్పటికీ వ్యామోహం లేదు. పాకిస్థాన్‌కు సంబంధించి ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావని చాలామంది అడిగారు. మన దేశ నిర్మాతల విజన్‌ను సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా. పాకిస్థాన్ ఉన్నతస్థానంలో ఉండడం నా చిన్నతనంలో చూశా.  అభివృద్ధి విషయమై దక్షిణ కొరియా దేశం పాకిస్థాన్‌ను సాయం కోరేది. మలేషియా రాకుమారులు నాతో కలిసి చదువుకున్నారు. మధ్య ప్రాచ్యం నుంచి విద్యార్థులు వచ్చి, పాకిస్థాన్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేసేవారు. పతనం వరకు కూడా పాకిస్థాన్‌ను చూశాను. 
 
ముస్లింలు ఎన్నటికీ బానిసలుగా ఉండరు. నేను చెప్పేది యువత జాగ్రత్తగా వినాలి. అల్లా మీకు ఎగిరేందుకు రెక్కలు ఇచ్చాడు... కానీ ఎందుకు చీమల్లా కింద పాకుతున్నారు? మనకు ఆ భగవంతుడు దేవతల స్థాయి కల్పించాడు. కానీ మనం భయాన్ని స్మరిస్తున్నాం. డబ్బును ప్రేమిస్తున్నాం. మనుషులమైన మనం చీమల్లా ప్రవర్తిస్తున్నాం" అని పేర్కొన్నారు. 
 
"నాకంటే పాకిస్థాన్ ఐదేళ్లు పెద్దది. పాకిస్థాన్ తొలితరం వాళ్లలో నేనూ ఒకడ్ని. స్వాతంత్ర్యం వచ్చాక పుట్టినవాడ్ని. నాకు భారత్‌లోనూ, అమెరికాలోనూ ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారితో నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం, అజెండాలు లేవు. వారి విధానాలను మాత్రం ఖండించాను. ప్రధాని అయ్యాక ఏ ఒక్కరికో వ్యతిరేకంగా పాకిస్థాన్ వెళ్లరాదని భావించాను. భారత్‌తోనూ మా గొడవ ఒక్కటే. కశ్మీర్‌లో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నదే మా బాధ. 
 
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ముగ్గురు మాయగాళ్లు విదేశీ శక్తులతో జట్టుకట్టారు. ఇమ్రాన్ ఖాన్ అనేవాడ్ని పదవి నుంచి తప్పించాలనేది వారి అజెండా. నేను లేకపోతే అన్నీ చక్కబడతాయని వారు భావిస్తున్నారు. నేపాల్‌లో నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో రహస్యంగా భేటీ అయ్యారని బర్కా దత్ పుస్తకం చెబుతోంది. 
 
మరోసారి చెబుతున్నా... నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. 22 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం. నా మీద విమర్శలు కురిపిస్తున్న షాబాజ్ షరీఫ్... దేశంపై దాడులు జరుగుతున్న సమయంలో ఎక్కడున్నాడు? ఈ ఆదివారంతో అవిశ్వాస తీర్మానంపై ఓ నిర్ణయం వస్తుంది. దేశం మళ్లీ అవినీతిపరులు హస్తాల్లోకి వెళుతుందా? అనేది వెల్లడి కానుంది. 
 
నేను దేశాన్ని భ్రష్టు పట్టించానంటున్నారు... కానీ నేను పాలించింది ఈ మూడేళ్లు. అయితే, ఈ మూడేళ్లలో నేను చేసినంత అభివృద్ధి గతంలో ఎన్నడైనా జరిగిందా అని సవాల్ విసురుతున్నా? ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజీనామా చేయబోవడంలేదు. చివరిబంతి వరకు పోరాడతాను. చూస్తాను... నన్ను ఓడించే క్రమంలో ఎవరెవరు తమ ఆత్మసాక్షిని తాకట్టు పెడతారో వేచిచూస్తాను" అంటూ ఇమ్రాన్ తన సందేశం వెలిబుచ్చారు.