శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:21 IST)

ఐక్యరాజ్య సమితి వేదికగా 'అణు' విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్

ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అణు విషంకక్కారు. భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం అంటూ వస్తే అది అణు యుద్ధంతోనే ముగుస్తుందని ఐరాస వేదికగా గర్జన చేశారు. ఈ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపైనా పడుతుందని ఆయన హెచ్చరించారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయ అట్టుడికిపోతోంది, అక్కడ కర్ఫ్యూ ఎత్తివేస్తే రక్తపాతం జరుగుతందని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని రద్దుచేసిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కాశ్మీర్‌ అంశంపై ఐరాస భద్రతామండలి గతంలో జారీ చేసిన 11 ఉత్తర్వులను, సిమ్లా ఒప్పందాన్ని, తన సొంత రాజ్యాంగాన్ని భారత్‌ ఉల్లంఘించిందని ఆరోపించారు. ప్రపంచదేశాలు వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. 
 
కాశ్మీర్‌లో విధించిన కర్ఫ్యూను వెంటనే ఎత్తివేయాలని, రాజకీయ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేస్తే రక్తపాతం తప్పదంటూ ఇమ్రాన్‌ పరోక్షవ్యాఖ్యలు చేశారు. 'కాశ్మీర్‌లో ఆంక్షలను ఎత్తివేస్తే పరిస్థితి మొత్తం మారిపోతుంది. అప్పుడు నెలకొనే పరిణామాలకు భారత్‌ మమ్మల్ని నిందిస్తుంది' అని అన్నారు. 
 
ఈ యేడాది బాలాకోట్‌ దాడి అనంతరం తలెత్తిన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. 'రెండు పొరుగు దేశాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు ఏదైనా జరుగొచ్చు. ఒక దేశం (పాకిస్థాన్‌) తనకన్నా ఏడురెట్లు పెద్దదైన పొరుగుదేశంతో (భారత్‌తో) తలపడితే.. పోరాడటమా? లొంగిపోవడమా? అనే పరిస్థితి వస్తుంది. అప్పుడు చివరిక్షణం వరకు పోరాడుతాం' అని చెప్పారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే, దాని పరిణామాలు సరిహద్దులు దాటి మిగతా ప్రపంచంపైనా పడుతుందని హెచ్చరించారు. 'ఇది భయం కాదు.. నా హెచ్చరిక' అంటూ వ్యాఖ్యానించారు. అదే జరిగితే ఐరాసదే పూర్తి బాధ్యత అని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా హెచ్చరించారు.