గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 మే 2021 (17:33 IST)

గర్భంతో వున్న ఈజిప్టు మమ్మీని గుర్తించిన పరిశోధకులు.. గర్భంలోని పిండానికి..?

mummy
ఈజిప్టు మమ్మీల గురించి తెలిసిందే. అయితే తాజాగా ప్రపంచంలో మొదటిసారి గర్భంతో ఉన్న ఈజిప్టు మమ్మీని గుర్తించారు పరిశోధకులు. 1826లో కనుగొన్న ఒక ఈజిప్ట్ మమ్మీ ఏడు నెలల గర్భంతో ఉన్న ఒక మహిళది అని తాజాగా కనుగొన్నారు. పోలాండ్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచిన మమ్మీపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. 
 
దీని శవపేటికపైన పురుష మతబోధకుడని రాసి ఉంది. దీంతో ఈ మృతదేహం ఒక పురుషుడిది అని భావించారు. పోలాండ్ రాజధాని వార్సాలో నేషనల్ మ్యూజియం ఉంది. ఇక్కడ మమ్మీలకు సంబంధించిన అధ్యయనంలో భాగంగా వార్సా మమ్మీ ప్రాజెక్ట్ జరుగుతుంది. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన పరిశోధనల్లో మమ్మీ గర్భంతో ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనాన్ని జర్నల్ ఆఫ్ ఆర్కియాలాజికల్ సైన్స్‌లో ప్రచురించారు. అయితే అంతకుముందు చేసిన ఏ పరీక్షల్లోనూ ఈ మృతదేహం పురుషుడిది కాదని గుర్తించలేకపోయారు.
 
వార్సాలో భద్రపరిచిన ఈజిప్టు మమ్మీని దాదాపు 195 సంవత్సరాల క్రితం పోలాండ్‌కు తీసుకొచ్చారు. ఈ మృతదేహం పురుషుడిదిగానే భావించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా దీనికి ఎక్స్‌-రే, అత్యాధునిక కంప్యూటర్ పరీక్షలు చేసినప్పుడు అసలు నిజం తెలిసింది. 
 
అది ఏడు నెలల గర్భంతో ఉన్న ఒక మహిళ శవమని పరీక్షల్లో తేలింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత భద్రంగా సంరక్షించిన, గర్భంతో ఉన్న మృతదేహంగా ఈ ఈజిప్ట్ మమ్మీ నిలిచింది.
 
ఈ మమ్మీపై చేసిన అధ్యయనాల్లో కొత్త విషయాలను పరిశోధకులు కనుగొన్నారు. పురుషాంగం లేకపోవడం, వక్షోజాలు, పొడవాటి వెంట్రుకలు ఉండటంతో ఇది పురుష మతబోధకుడి శరీరం కాదని అనుమానించారు. తరువాత చేసిన అధ్యయనాల్లో ఈ మృతదేహం ఒక గర్భిణీ స్త్రీది అని గుర్తించారు. 
 
మమ్మీ గర్భంలోని పిండానికి చిన్న కాళ్లు, చేతులు సైతం అభివృద్ధి చెందాయని కనుగొన్నారు. ఈ ఈజిప్ట్ మమ్మీ వయసు 20 నుంచి 30 ఏళ్లు ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. 
 
గర్భంలోని పిండానికి 26 నుంచి 28 వారాల వయసు (సుమారు ఏడు నెలలు) ఉంటుందని నిర్ధారించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కనిపించిన ఎంబాల్మింగ్ గర్భిణీ మృతదేహం ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
 
మమ్మీని ఉంచిన శవపేటికపై చిత్రలిపి ఉంది. దీన్ని బట్టి ఈ మమ్మీ క్రీ.పూ. 1వ శతాబ్ధం నుంచి క్రీ.శ. 1వ శతాబ్ధం మధ్య జీవించిన పురుష మతబోధకుడి అని తెలుస్తుంది.