మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 23 మే 2017 (07:40 IST)

భారత్ ఉగ్ర బాధిత దేశం... పాకిస్థాన్‌కు అవమానం.. ఎక్కడ.. ఎందుకు?

ప్రపంచంలోని ఉగ్రబాధిత దేశాల్లో భారత్ ఒకటని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, 'ఏ దేశమూ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయంగా మార్చకూడదు. ఉగ్రవాదంపై పోరాటమంటే మంచి చెడుల మధ్య పోరే'

ప్రపంచంలోని ఉగ్రబాధిత దేశాల్లో భారత్ ఒకటని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే, 'ఏ దేశమూ తన భూభాగాన్ని ఉగ్రవాదులకు ఆశ్రయంగా మార్చకూడదు. ఉగ్రవాదంపై పోరాటమంటే మంచి చెడుల మధ్య పోరే' అని చెప్పుకొచ్చారు. 
 
సౌదీ అరేబియా ఏర్పాటు చేసిన అరబ్‌, ఇస్లామిక్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఇందులో దాదాపు 35 ముస్లిం మెజారిటీ దేశాధినేతలు హాజరైన ఈ సదస్సులో ట్రంప్‌ మాట్లాడుతూ ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత ఒకటని ప్రస్తావించారు.
 
యూరప్‌, దక్షిణ అమెరికా, భారత, రష్యా, చైనా, ఆస్ట్రేలియాలు ఉగ్రవాదుల చేతుల్లో పదేపదే ఆటవిక దాడులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరును జాతుల మధ్య పోరుగానో, మత విశ్వాసాల మధ్య పోరుగానో భావించరాదని సూచించారు.
 
'అమెరికా వచ్చి శత్రువును తుద ముట్టించే వరకు వేచిచూస్తామంటే కుదరదు. మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలో మీరే నిర్ణయించుకోండి' అని అరబ్బు దేశాలను హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలు తమగడ్డ మీద నుంచి విస్తరిస్తున్న ఇస్లామిక్‌ తీవ్రవాదంపై గట్టి పోరాటం చేయాలన్నారు. 
 
ఇదిలావుంటే.. ఈ సదస్సుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. కానీ, ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అదేసమయంలో అనేక చిన్నదేశాల ప్రతినిధులకు మాట్లాడే అవకాశం కల్పిచారు. 
 
దీనిపై పాకిస్థాన్ మీడియా గగ్గోలు పెడుతోంది. చిన్న చిన్న దేశాల ప్రతినిధులకు కూడా అవకాశమిచ్చి అణ్వాయుధ శక్తి గలిగిన అతిపెద్ద ఇస్లామిక్‌ దేశ ప్రతినిధికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానమేనని పాక్‌ మీడియా ఘోషిస్తోంది.