శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (12:31 IST)

ఇండోనేషియాలో రెడ్‌ అలర్ట్‌... ఏ క్షణమైనా అగ్నిపర్వతం బద్దలు (వీడియో)

ఇండోనేషియా వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. మౌంట్‌ అగుంగ్‌ అగ్నిపర్వతం వారం రోజుల నుంచి దట్టమైన పొగలు జిమ్ముతోంది. దీంతో ఇది ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇండోనేషియా వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. మౌంట్‌ అగుంగ్‌ అగ్నిపర్వతం వారం రోజుల నుంచి దట్టమైన పొగలు జిమ్ముతోంది. దీంతో ఇది ఏ క్షణంలోనైనా బద్దలయ్యే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా బాలీ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రారతాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కారణంగా స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం 11,150 అడుగుల ఎత్తువరకు దట్టమైన పొగను ఎగచిమ్ముతోంది. పేలుడు శబ్ధాలు సుమారు 12 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తున్నాయని నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు తెలిపారు. బూడిద, దట్టమైన పొగతో పాటు మంటలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగా అధికారులు నాలుగో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అగ్నిపర్వతం పేలే ప్రమాదం ఉందన్నారు. 
 
అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడటానికి సిద్ధంగా ఉందని అడిలైడ్‌ యూనివర్శిటీ భూగర్భశాస్త్ర నిపుణుడు మార్క్‌ తింగై అంచనా వేస్తున్నారు. అయితే, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ముందే ఊహించడం కష్టమని కూడా ఆయన చెప్పారు. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిత లొంబక్‌ నగరం అంతటా వ్యాపించింది. సుమారు 25 వేల మంది ప్రజలు తాత్కాలిక సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. దాదాపు లక్ష 40 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. 
 
ప్రపంచంలోనే భిన్నమైన భౌగోళిక ప్రత్యేకతలు గల ఇండోనేసియా 17వేల చిన్నదీవుల సమూహం. పసిఫిక్‌ మహాసముద్రంలోని టెక్టోనిక్‌ ప్లేట్లు తరచూ ఢీకొట్టుకోవడం వల్ల ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటనాలు కూడా ఎక్కువే. ప్రఖ్యాత పర్యాటక తీరం బాలీకి సమీపంలో మౌంట్‌ అగుంగ్‌ ఉంటుంది. ఇండోనేషియాలో 130 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. 1963లో 'అగుంగ్‌' అగ్నిపర్వతం పేలడంతో 1000 మంది చనిపోయిన విషయం తెల్సిందే. అలాగే, 2004లో వచ్చిన సునామీ వల్ల వేలాది మంది జలసముద్రమయ్యారు.