భర్త తిన్న ప్లేటు, గ్లాసు బయటకు విసిరేసిన భార్య.. ఎందుకో తెలుసా?
భర్త తిన్న ప్లేటు, గ్లాసును కడిగేందుకు నిరాకరించిన భార్య వాటిని ఇంటి బయటకు విసిరేసింది. సిరామిక్, గాజు వస్తువులు కావడంతో అవి పగిలిపోయాయి. ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసిన ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. ఒక భర్త భోజనం చేసిన తర్వాత తాను తిన్న ప్లేటు, గ్లాసును భార్య కడిగేందుకు టేబుల్‌పైనే వదిలేశాడు. దీంతో చిరాకెత్తిన అతడి భార్య వాటిని ఇంటి బయటకు విసిరేసింది. దీంతో సిరామిక్ ప్లేటు, గాజు గ్లాసు పగిలిపోయాయి.
మరోవైపు ఆ ఇండోనేషియా మహిళ తన చర్యను సమర్ధించుకుంది. తిన్న ప్లేటును మగవారు ఎందుకు కడుగరు? అని ఆమె ప్రశ్నించింది. వాడిన పాత్రలను వారు శుభ్రం చేయడంలో తప్పు ఏముంది? అని నిలదీసింది. భర్త తిన్న ప్లేటు, గ్లాసును ఇంటి బయటకు విసిరేసిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. 'భార్యను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి' అని అందులో పేర్కొంది.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారితీసింది. తిన్న ప్లేటును భర్త కడుగకపోయినా, కనీసం సింక్‌లోనైనా వేయాలని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఆ మహిళ చర్యను తప్పుపట్టారు.
ఒక్క ప్లేటే కావడంతో దానిని ఆమె కడిగి ఉండాల్సిందన్నారు. ఇంకొకరు భిన్నంగా స్పందించారు. అరటి ఆకుల్లో ఆహారం తినడమే ఈ సమస్యకు పరిష్కారమని సలహా ఇచ్చారు. కావాలనుకుంటే అరటి ఆకును కూడా తినేయవచ్చంటూ చమత్కరించారు.