మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (18:19 IST)

పాముతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత ఖైదులు

పాముతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత కారాగారశిక్షలను విధిస్తూ కేరళ కోర్టు ఒకటి సంచలన తీర్పునిచ్చింది. ఇటీవల ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను పాముతో కరిపించి చంపాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో న్యాయస్థానం అత్యంత కఠిన శిక్ష విధించింది. అతనికి రెండు జీవిత ఖైదులు విధించింది. 
 
మృతురాలి భర్త సూరజ్ కథనం ప్రకారం ఓ విషసర్పం ఇంట్లోకి ప్రవేశించి, నిద్రపోతున్న తన భార్య ఉత్తర (27)ను రెండుసార్లు కాటేసింది. దాంతో ఆమె మరణించిందని అతడు నమ్మబలికాడు. అందుకు సాక్ష్యంగా చచ్చిన పామును కూడా చూపించాడు. ఈ ఘటన గత 2020 సంవత్సరంలో ఉత్తర కొల్లంలో జరిగింది. 
 
అయితే, ఉత్తర తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల కిందటే తన కుమార్తె పాము కాటుకు గురైందని, దానికి చికిత్స పొందుతుండగానే మరోసారి పాము కరవడం ఏంటని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, నివ్వెరపోయే నిజాలు వెల్లడించాడు.
 
రెండో పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంతో తానే ఉత్తరను పాముతో కరిపించి, హత్య చేశానని వాంగ్మూలం ఇచ్చాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషసర్పాన్ని తీసుకువచ్చానని వివరించాడు. తొలిసారి ఉత్తరను కరిచింది రక్తపింజరి కాగా, రెండోసారి నాగుపాము అని తెలిపాడు. 
 
ఉత్తర తన పుట్టింట్లో చికిత్స పొందుతున్న సమయంలో నాగుపామును వదిలినట్టు చెప్పాడు. పాములతో మనుషులను చంపడంపై సూరజ్ ఇంటర్నెట్‌ను శోధించినట్టు సమాచారం సేకరించినట్టు చెప్పాడు. ఆ తర్వాత అతని కాల్ డేటాను కూడా పరిశీలించి కీలక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు కీలక తీర్పు... వాస్తవానికి అతడు చేసిన ఘాతుకానికి మరణశిక్షే కరెక్ట్ అని, కానీ అతడి వయసు 28 ఏళ్లే కావడంతో, అతడికి రెండు జీవిత ఖైదులు విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నాడు. 
 
తొలిగా చేసిన హత్యాయత్నానికి 10 ఏళ్ల జైలు శిక్ష, సాక్ష్యాధారాలను నాశనం చేశాడంటూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ శిక్షలు పూర్తయిన తర్వాత రెండు జీవిత ఖైదుల శిక్ష ప్రారంభం అవుతుందని న్యాయమూర్తి అంతిమతీర్పులో వివరించారు. ఈ శిక్షలతో పాటు రూ.5.85 లక్షల జరిమానా కూడా విధించారు.