బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కేరళలో కరోనా కల్లోలం : కఠిన ఆంక్షలతో 48 గంటల లాక్డౌన్

కేరళ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీంతో కఠిన ఆంక్షలతో 48 గంటల పాటు లాక్డౌన్ అమల్లోకిరానుంది. కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో కేరళలో ఆంక్షలు విధించారు. 
 
ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్‌ అమలు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసింది. ఇందులో భాగంగా 48 గంటల పాటు లాక్డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది.
 
కేరళ రాష్ట్రంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న పోలీసులు నిబంధనలు పాటించనివారిపై జరిమానాలు విధిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. సరైన పత్రాలను చూపించిన వారిని మాత్రమే వదిలేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, కూరగాయల మార్కెట్లలో రద్దీ తగ్గింది. 
 
కేరళలో శుక్రవారం కొత్తగా రికార్డుస్థాయిలో 28 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు.. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తెచ్చినవారిని మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.