అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)
తిక్కలోడు తిరునాళ్లకు వెళితే... అన్న సామెత చందంగా వుంటుంది కొంతమంది చేసే పనులు. విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా గాల్లో ఎగురుతున్న విమానం ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. దీనితో తోటి ప్రయాణికులందరూ బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన గత నవంబరు నెలలో జరిగినప్పటికీ దాని తాలూకు వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
బ్యాంకాక్- సియోల్ మధ్య KE658 విమానం గాలిలో ప్రయాణిస్తోంది. ఆ ప్రయాణ సమయంలో అనుమతి లేకుండా అత్యవసర నిష్క్రమణ దగ్గర సిబ్బందికి మాత్రమే ఉన్న సీట్లో ఓ ప్రయాణీకుడు కూర్చున్నాడు. సిబ్బందికి ఈ విషయం తెలియగానే, వారు అతనిని తమ సీటు వద్దకు తిరిగి రమ్మని అడిగారు. కానీ అతను నిరాకరించి అత్యవసర నిష్క్రమణ ద్వారం వద్దకు చేరుకుని విమానం తలుపుని తీసేందుకు యత్నిస్తూ సిబ్బందిపై కేకలు వేస్తూ బెదిరించాడు.
37,000 అడుగుల ఎత్తులో 284 మంది ప్రయాణికులతో ఉన్న ఎయిర్‌బస్ A330-300 విమానంకి చెందిన ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ఆ వ్యక్తి ప్రయత్నించగా అతడిని అడ్డుకోవడానికి అనేక మంది విమాన సిబ్బంది ప్రయత్నించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత అతడిపై కేసు నమోదు చేసారు.