శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (22:23 IST)

అమెరికాలో ఇది సరికొత్త రోజు.. జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో ఇది సరికొత్త రోజు అని అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌ ప్రెసిడెంట్‌గా డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాల పదవీకాలం అనంతరం బుధవారం వైట్‌హౌస్‌ను వీడారు. ట్రంప్‌ వైట్‌హౌస్‌ను వీడిన నిమిషాల్లోనే బైడెన్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. న్యూ డే ఇన్‌ అమెరికా అని పేర్కొన్నారు. 
 
బుధవారం ఉదయం వాషింగ్టన్‌ డీసీలోని సెయింట్‌ మాథ్యూస్‌ కేథడ్రల్‌ వద్ద ఐక్యతకు చిహ్నంగా డెమోక్రాటిక్‌, రిపబ్లికన్‌ నాయకులతో జరిగిన ఓ సామూహిక కార్యక్రమానికి బైడెన్‌ హాజరయ్యారు. సతీమణి జిల్‌ బిడెన్‌, డెమోక్రాటిక్‌ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి, సేనేట్‌ మైనారిటీ నాయకుడు చక్‌ షుమెర్‌, అదేవిధంగా రిపబ్లికన్‌ సెనేట్‌ నాయకుడు మిచ్‌ మక్కన్నేల్‌, సభా నాయకుడు కెవిన్‌ మెక్‌కార్తీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే వైట్‌హౌస్‌ను వీడి ఫ్లోరిడా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తన దీర్ఘకాలిక వీడ్కోలు కాదని, తాత్కాలికమేనన్నారు. ఏదో రూపంలో తిరిగి వస్తామని పేర్కొన్నారు.
 
మరోవైపు ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశానికి కొత్త అధ్యక్షుడుగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్.. ఉపాధ్యకురాలిగా కమలా హ్యారిస్.. తమ పీఠాలను అదిరోహించే సమయం ఆసన్నమైంది. అధ్యక్షుడు కావాలన్న ఆయన ఐదు దశాబ్దాల కల నేడు సాకారం కాబోతున్నది. ఇందుకు వాషింగ్టన్ లోని క్యాపిటల్ హాట్ బిల్డింగ్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.