జో బైడెన్ ముందున్నది పూలబాట కాదా? సవాళ్ళ స్వాగతం!
అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గత 90 యేళ్ళ చరిత్రలో ఎన్నడూ చూడనంత సంక్షోభ పరిస్థితుల మధ్య ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ముందువున్నది పూలబాట కాదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి బలమైన కారణాలు అనేకం ఉన్నాయని వారు చెబుతున్నారు.
ముఖ్యంగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అమెరికన్ ప్రజలపై బైడెన్ వరాల జల్లు కురిపించారు. ఫలితంగా ఆయన అధ్యక్ష పీఠం దక్కింది. అయితే, ఆ హామీల అమలే ఇపుడు పెద్ద సమస్యగా మారింది.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్‌తో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, నిరుద్యోగిత రేటును తగ్గించడం, కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఒక్కొక్క అమెరికన్‌కు 1,400 డాలర్లు (రూ.1.02 లక్షలు) చొప్పున బ్యాంకు ఖాతాలో జమచేయడానికి 1.9 ట్రిలియన్ల డాలర్లతో ఉద్దీపన ప్యాకేజీకి చట్టసభల్లో ఆమోదం ముద్ర వేయించాల్సివుంది.
అలాగే, ముస్లిం దేశాలపై విధించిన వీసా నిబంధనలు తొలిగించడం వంటి హామీలను బైడెన్ అమలు చేయడం అంత సులభం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ, 'అధికారాన్ని చేపట్టిన తొలి వంద రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు కరోనా టీకా' హామీ మాత్రం నెరవేరవచ్చని తెలిపారు.
అయితే, బైడెన్‌కు ట్రంప్‌కు మధ్య చాలా తేడా వుంది. ట్రంప్‌ది అతి దూకుడు... రెచ్చగొట్టే నైజం.. బైడెన్ సాత్వికుడు. సహజంగా లిబరల్, వామపక్ష - అనుకూల వాది. పైగా, కరోనా కారణంగా గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత వైద్య ఆరోగ్య అత్యవసర పరిస్థితులు అగ్రరాజ్యంలో నెలకొన్నాయి. రోజుకు 4 వేల మంది చనిపోవడం, ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 4 లక్షలకు చేరుకోవడంతో బైడెన్ దీనిని తన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇకపోతే, కొవిడ్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కకావికలమైపోయింది. లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ వల్ల పరిస్థితి మరింతగా దిగజారింది. వీటికి తోడు దేశవ్యాప్తంగా వేలమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీన్ని పునరుద్ధరించడం బైడెన్‌కు కత్తి మీద సామే.
1861 అంతర్యుద్ధం తర్వాత అమెరికన్ సమాజం నిట్టనిలువుగా చీలిపోయిన సన్నివేశం ఇపుడే పొడగట్టింది. దీనికి డోనాల్డ్ ట్రంప్ ఆజ్యం పోశారు. ఈ చీలికను మళ్లీ పూడ్చి దేశాన్ని ఏకం చేయడం బైడెన్ ముందున్న అతి పెద్ద సవాలు. అందుకే ఆయన అమెరికా యునైటెడ్ అన్న నినాదాన్ని అందుకున్నారు.
డోనాల్డ్ ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానం వల్ల ఓ రకంగా ప్రపంచ నేతగా ఏళ్ల తరబడి ఉన్న గుర్తింపును అమెరికా కోల్పోయింది. దీన్ని సరిదిద్దుతానని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. అమెరికా ఈజ్ బ్యాక్ అన్నది ఆయన నినాదం. విస్తరణవాదంతో నానాటికీ రెచ్చిపోతున్న చైనాకు ఆయన ఎంతవరకూ కళ్లెం వేస్తారన్నది చూడాలి. ఇక ఇస్లామిక్ దేశాలతో ట్రంప్ ద్వేషమయ సంబంధాలను కొనసాగించగా, బైడెన్ మాత్రం సానుకూల దృక్పథంతో ముందుగు సాగాలని భావిస్తున్నారు.