శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (08:11 IST)

స్పెయిన్‌లో వంద ఇళ్లను భస్మీపటలం చేసిన లావా

స్పెయిన్‌లో అగ్నిపర్వతం ఒకటి పేలింది. దీని నుంచి విడుదలైన లావా వందకు పైగా గృహాలను భస్మీపటలం చేసింది. తన దారిలో కనిపించిన ప్రతి వస్తువునూ భస్మం చేస్తూ దూసుకుపోయింది. ఈ ఘటన స్పెయిన్‌లోని కేనరీ దీవుల్లో చోటుచేసుకుంది. 
 
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడి లా పామా దీవిలో ఉండే ‘ది కుంబ్రే వీజా’ అనే అగ్నిపర్వతం బద్దలయ్యింది. దీంతో ఉప్పొంగిన లావా ఆ దీవిని ముంచెత్తింది. ఈ క్రమంలో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి అధికారులు చాలా కష్టపడ్డారు. 
 
ప్రస్తుతానికి 10 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే 100 ఇళ్లను లావా ముంచేసిందని వారు వెల్లడించారు. లావా సుమారు 6 మీటర్లు అంటే 20 అడుగుల మందంలో ఉందని అధికారులు తెలియజేశారు. అది తాకిన ఇళ్లన్నీ బుగ్గిపాలయ్యాయని వివరించారు.
 
స్థానికంగా ఉన్న ఒక చిన్న స్కూల్ కూడా ఈ లావాకు బలైపోయినట్లు సమాచారం. ‘రెండు గంటల క్రితం వరకూ స్కూల్‌కు ఏమీ కాదనే అనుకున్నాం. కానీ దాన్ని కూడా లావా ముంచేసింది’ అని ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ కన్నీళ్లతో చెప్పారు. 
 
‘మా ఇంటి నుంచి 700 మీటర్ల దూరంలో లావా ఉందని తెలిసింది. మాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు’ అని ఒక స్థానికురాలు వాపోయింది. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి ఇల్లు వదిలి తప్పించుకొని వచ్చిందామె. పోలీసులు తమకు మూడు నిమిషాల సమయం ఇచ్చారని, అంతా చాలా వేగంగా జరిగిపోయిందని ఆమె బాధపడుతోంది.