మలేషియా ''మురుగన్''కు ఐఎస్ ముప్పు.. ముగ్గురు టెర్రరిస్టుల అరెస్ట్..
మలేషియా మురుగన్‌పై ముగ్గురు ఐస్ టెర్రరిస్టులు కన్నేశారు. మలేషియాలోని ప్రముఖ హిందూ దేవాలయమైన కుమారస్వామి ఆలయంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, పోలీస్ స్టేషన్లపై విధ్వంసం సృష్టించాలని ట
మలేషియా మురుగన్‌పై ముగ్గురు ఐస్ టెర్రరిస్టులు కన్నేశారు. మలేషియాలోని ప్రముఖ హిందూ దేవాలయమైన కుమారస్వామి ఆలయంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, పోలీస్ స్టేషన్లపై విధ్వంసం సృష్టించాలని టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. అయితే ఉగ్రవాదులు పన్నిన కుట్రను చాకచక్యంగా మలేషియా పోలీసులు భగ్నం చేశారు. పేల్చివేతకు కుట్రపన్నిన ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) టెర్రరిస్టులను మలేషియాలో అరెస్ట్ చేశారు.
బుధవారంనాడు మలేషియా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో దాడులకు తెగబడేందుకు టెర్రరిస్టులు కుట్ర పన్నారు. అయితే ఐసిస్‌తో ముప్పు వుందని గమనించిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక శాఖ పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఈ నెల 27, 29 తేదీల్లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
వీరివద్ద జరిపిన విచారణలో ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు తేలిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఖలిద్ అబు బకర్ వెల్లడించారు. దాడికి కుట్ర చేసిన ముగ్గురు 20 నుంచి 30 ఏళ్లలోపు మధ్యవారేనని, వీరి వద్ద గ్రనేడ్, పిస్తోల్, 9 ఎంఎం బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు లారీ డ్రైవర్ కాగా, మరొకరు కసాయి పని, మూడో వ్యక్తి పానీయాలను విక్రయించేవాడని పోలీసులు వెల్లడించారు.
కాగా మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బాతు కేవ్స్‌లో కుమారస్వామి ఆలయమున్న సంగతి తెలిసిందే. మలేషియాలో ఏ భారతీయ సినిమా చిత్రీకరించినా ఈ ఆలయాన్ని తప్పకుండా ఫోకస్ చేస్తారు. బాహుబలి ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో కొన్ని సీన్స్ ఈ ఆలయంలో చిత్రీకరించడం జరిగింది.