శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (12:23 IST)

అత్యవసర విమానాన్ని నిరాకరించిన మాల్దీవులు... 14 యేళ్ల బాలుడు మృతి

deadbody
గత కొన్ని రోజులుగా భారత్ - మాల్దీవుల దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు చెందిన ఇద్దరు మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. 
 
మాల్దీవులకు భారత్ అందించిన 'డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్' అనే చిన్న విమానం ఎమర్జెన్సీ ప్రయాణానికి అనుమతి లేకపోవడంతో 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతూ స్ట్రోక్‌కు గురైన బాలుడిని మాల్దీవులలోని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలోని తమ ఇంటి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా రాజధాని మాలే నగరానికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించారు. ఈ మేరకు అభ్యర్థన కూడా చేశారు. 
 
కానీ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ఈ మధ్య భారత్ అందించిన విమానాలను ఉపయోగించొద్దని ఆదేశించడంతో బాలుడిని అత్యవసరంగా తరలించడం సాధ్యపడలేదని మాల్దీవుల మీడియా పేర్కొంది. హాస్పిటల్ వైద్యులు బాలుడిని తరలించేందుకు సత్వరమే ఏర్పాట్లు చేసినప్పటికీ విమానాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
అనేక మార్లు ఫోన్ చేసినప్పటికీ అధికారుల నుంచి సమాధానం రాలేదని, వారి నుంచి సమాధానం వచ్చేలోగా నష్టం జరిగిపోయిందని వాపోయారు. అభ్యర్థన చేసిన 16 గంటల తర్వాత మాలేకి బాలుడిని తరలించామని, అప్పటికే బాగా ఆలస్యం కావడంతో బాలుడి ప్రాణాలు దక్కలేదని వివరించారు. కాగా ఇలాంటి ఎమర్జెన్సీ కేసులకు ఎయిర్ అంబులెన్స్ ఉండటమే పరిష్కారమని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు మాల్దీవులు మీడియా పేర్కొంది.
 
అత్యవసర తరలింపునకు సంబంధించిన అభ్యర్ధన అందిన వెంటనే తరలింపునకు ఏర్పాట్లు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ చివరి క్షణంలో విమానానికి సంబంధించిన సాంకేతిక అంశం విషయంలో తక్షణ తరలింపు సాధ్యం కాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షదీప్ పర్యటనను ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.