గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (12:47 IST)

హత్యకు ముందు హోటల్ గదిలో ప్రియుడితో ప్రీతి రెడ్డి.. ఏం జరిగిందో?

ఆస్ట్రేలియాలో హత్యకు గురైన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నారై దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి (32) హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆమె ప్రియుడేనని ఆస్ట్రేలియా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే హత్య జరిగిన మరుసటి రోజే హర్షవర్ధన్‌ కార్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే ప్రీతి స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంట గ్రామం. తల్లిదండ్రులు సుచరిత, నర్సింహారెడ్డి. ఆమె తండ్రి కూడా వైద్యుడే. నర్సింహారెడ్డి ఇద్దరు సంతానంతో ప్రీతి పెద్ద కుమార్తె. 1996లో ఆస్ట్రేలియా వెళ్లి కుటుంబంతో సహా అక్కడే స్థిరపడ్డారు. ప్రీతిరెడ్డి వైద్య విద్యను అక్కడే అభ్యసించింది. సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్లూ మౌంటేన్స్‌లోని గ్లేన్‌బ్రూక్‌ డెంటల్‌ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తోంది. 
 
ఈనెల 2న సెయింట్‌ లియోనార్డ్‌లో జరిగే ఓ సమావేశానికి ప్రీతి హాజరైంది. ఆదివారం ఇంటికి ఫోన్ చేసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నానని త్వరగా వస్తానని చెప్పింది. అయితే ఆ రోజు అమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కింగ్స్‌ఫోర్డ్‌ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. 
 
శరీరమంతా కత్తిపోట్లతో పొడిచి హత్య చేసి శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కారులో ఉంచారు. పోలీసుల కథనం ప్రకారం హర్షవర్ధన్‌తో ప్రీతి చాలా రోజుల క్రితమే ప్రేమ బంధాన్ని తెంచుకుంది. అయితే అతను ఆమెను వేధించడం మానలేదు. విసిగిపోయిన ప్రీతి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆదివారం హర్షవర్ధన్‌తో కలిసి సిడ్నీలోని ఓ హోటల్‌‌లో గదిని అద్దెకు తీసుకుంది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
వారిద్దరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రీతి కనిపించకపోవడం, తర్వాత రోజే ప్రియుడు లారీ ఢీకొని కార్ యాక్సిడెంట్‌లో చనిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. హర్షవర్ధన్ హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ హైదరాబాద్‌లో నరసింహారెడ్డి సోదరుడి కుమార్తె పెళ్లికి ప్రీతి హాజరైందని కుటుంబ సభ్యులు చెప్పారు.