ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సై!... చేతులు కలిపిన నవాజ్ - బిలావల్ భుట్టో?

pakistan flag
పాకిస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది. మేరకు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒక అవగాహన ఏర్పడింది. ఈ రెండు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోల నాయకత్వంలో పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈ మేరకు పలు దఫాలుగా జరిగిన సుధీర్ఘ చర్చల్లో అధికార పంపకంపై కొన్ని కీలక ప్రతిపాదనలు ముందుకొచ్చినట్టు సమాచారం. తమ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీకి ప్రధాని పదవి కావాలని పాకిస్థాన్ పీపుల్స్‌ పార్టీ గట్టి పట్టుబడినట్లు సమాచారం. ప్రధాని పదవిని మూడేళ్ల పాటు నవాజ షరీఫ్.. రెండేళ్ళు బిలావల్ భుట్టోలు పంచుకోవాలన్న ప్రతిపాదనపైనా కసరత్తు జరిగింది. అయితే, ముందుగా ప్రధాని పగ్గాలను ఏ పార్టీ స్వీకరించాలన్న విషయంపై స్పష్టత రాలేదు. 
 
మరోవైపు, పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకు జరిగిన ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ మూడు పార్టీలు సింధ్‌ ప్రావిన్స్‌లోని మూడు స్థానాలను వదులుకుంటున్నట్లు ప్రకటించాయి. అయితే రిగ్గింగ్‌ ఆరోపణలను ఆ దేశ ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. సింధ్‌ ప్రావిన్స్‌లో తాను పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పీటీఐ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి గెలిచారని జమాత్‌-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్‌ నాయకుడు హఫీజ్ నయీమూర్ రెహ్మాన్‌ తెలిపారు. 
 
అనేక నియోజకవర్గాల్లో జరిగిన రిగ్గింగ్‌ను ఎత్తిచూపేందుకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. తమకు తక్కువ ఓట్లు వచ్చాయని పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం వివరించిందని తెలిపారు. తమ బృందం అంచనాల ప్రకారం పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సైఫ్ భారీ ఓట్లను 31 వేల నుంచి 11 వేలకు తగ్గించారని ఆరోపించారు. అయితే పీఎస్‌-129 నియోజకవర్గం నుంచి నయీమూర్ 26 వేల 296 ఓట్ల మెజారిటీతో గెలిచారని పాక్‌ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల లెక్కింపులో అవకతవకల నేపథ్యంలో సింధ్‌ ప్రావిన్స్‌లోని రెండు స్థానాలను వదులుకుంటున్నట్లు గ్రాండ్‌ డెమోక్రాటిక్‌ అలయెన్స్‌ చీఫ్‌ షా రశీది తెలిపారు.