శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (12:45 IST)

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ... పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని!

భారత మిత్రదేశమైన నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార పార్టీలో ఏర్పడిన ముసలంతో ఆ దేశ ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఒలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు చిర్రెత్తుకొచ్చి ఏకంగా పార్లమెంటునే రద్దు చేశారు. 
 
సొంత పార్టీలోనే ఏర్ప‌డిన ముస‌లం ఆయన్ను గుక్కతిప్పుకోనివ్వకుండా చేసింది. దీంతో ఆయన ఆదివారం ఏకంగా పార్ల‌మెంట్‌నే ర‌ద్దు చేశారు. ఆదివారం ఉద‌యం జ‌రిగిన కేబినెట్ స‌మావేశం ఈ మేర‌కు పార్ల‌మెంట్ ర‌ద్దు చేయాలంటూ ప్రెసిడెంట్‌కు సిఫార‌సు చేసిన‌ట్లు ఇంధ‌న శాఖ మంత్రి బ‌ర్ష‌మాన్ పున్ వెల్ల‌డించారు. 
 
ఓ వివాదాస్ప‌ద ఆర్డినెన్స్ ర‌ద్దు చేయాలంటూ సొంత పార్టీ నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీలోని ప్ర‌ధాని ఓలి విరోధులు.. చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఓలి వ్య‌తిరేక వ‌ర్గానికి మాజీ ప్ర‌ధాని పుష్ప క‌మ‌ల్ ద‌హ‌ల్ ప్ర‌చండ నేతృత్వం వ‌హిస్తున్నారు. వాళ్ల‌ను బుజ్జ‌గించ‌డానికి ఓలి చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. శ‌నివారం సాయంత్రం ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీని కూడా క‌లిశారు.
 
ఈ ఆర్డినెన్స్ విష‌యంలోనే పార్టీ చీలిక వ‌ర‌కూ వెళ్లింది. ఆ చీలికను ఆప‌డానికే ప్ర‌ధాని ఓలి.. ఇలా ఉన్నట్టుండి పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేసిన‌ట్లు భావిస్తున్నారు. మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వానికి ఆయ‌నే నేతృత్వం వ‌హించ‌నున్నారు. కీల‌క‌మైన నియామ‌కాలు చేయ‌డానికి పూర్తి అధికారం త‌న‌కు తానుగా క‌ట్ట‌బెట్టుకుంటూ గ‌త మంగ‌ళ‌వారం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదాస్ప‌ద‌మైంది. 
 
బుధ‌వారం స‌మావేశ‌మైన పార్టీ స్టాండింగ్ క‌మిటీ.. ఈ ఆర్డినెన్స్ ఉప‌సంహ‌రించుకోవాల‌ని ప్ర‌ధాని ఓలిని డిమాండ్ చేసింది. మొద‌ట్లో పార్టీ ఒత్తిడికి త‌లొగ్గినా.. త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్నారు. శ‌నివారం స్వ‌యంగా ప్ర‌పండ ఇంటికి వెళ్లిన ప్ర‌ధాని ఓలి.. స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నించారు. అయినా ప్రచండ ఏమాత్రం తలొగ్గలేదు. దీనికి ప్రతిచర్యగా ప్రధాని పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.