శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 మే 2022 (10:50 IST)

తగలబడుతున్న శ్రీలంక - రాజపక్స రాజీనామా.. ప్రతిపక్ష నేతపై దాడి

sri lanka row
శ్రీలంక తగలబడిపోతోంది. లంకాదేశం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని పోయింది. దీంతో ఆ దేశ ప్రజలు పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేశాన్ని పాలిస్తున్న అధ్యక్షుడు, ప్రధానమంత్రి తక్షణం తమతమ పదవుల నుంచి తప్పుకోవాలని ఆ దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న ఈ ఆందోళనకు సోమవారానికి తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రజలపై రాజపక్స మద్దతుదారులు దాడికి దిగారు.
 
దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లంకలో చెలరేగిన ఆందోళన, హింసాత్మక చర్యల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా వందమందికిపైగా గాయపడ్డారు. దీంతో దిగివచ్చిన ఆ దేశ ప్రధాని రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత దేశంలో ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. రాజపక్సే పూర్వీకులకు సంబంధించిన ఇళ్ళకు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. 
 
మరోవైపు, సోమవారం ఆందోళనకారుల చేతిలో నుంచి తప్పించుకుని సమీపంలోని భవనంలోకి వెళ్లిన ఎంపీ అమరకీర్తి శవమై కనిపించారు. మరోవైపు, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించేందుకు సజిత్ వచ్చారు. అప్పటికే అక్కడ ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. 
 
దీంతో సజిత్‌‍ను చూసిన ఆందోళనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం అనుకూల వర్గాలు ఆయనపై దాడికి పాల్పడ్డాయి. అలాగే, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు కూడా ఆయనపై దాడికి యత్నించడం గమనార్హం. రాజపక్సే ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విపక్ష నేతగా సజిత్ పూర్తిగా విఫలమయ్యారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ అమలవుతుంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు, సైనిక బలగాలను మొహరించారు.