శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (13:42 IST)

పాక్ - చైనాల వక్రబుద్ధి : జాయింట్ మిస్సైల్ విన్యాసాలు

పాకిస్థాన్, చైనాలు మరోమారు తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి భారత్‌కు వ్యతిరేకంగా మిస్సైల్ విన్యాసాలు నిర్వహించారు. అయితే, భూమార్గంలో కూడా భారత్‌పై దాడి చేసేందుకు దారులు వెతుకుతున్నాయి. ఇందులోభాగంగా, టిబెట్‌లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తున్నాయి. వాస్త‌వాధీన రేఖ వెంట జ‌రుగుతున్న ఈ ప‌రిణామంపై అంద‌రి దృష్టి ప‌డింది. 
 
వాస్త‌వాధీన రేఖ వెంట పీఎల్ఏ ఎయిర్‌ఫోర్స్ ద‌ళం ప‌టిష్టంగా త‌యార‌వుతున్న‌ట్లు ఓ మీడియా సంస్థ క‌థ‌నం రాసింది. పాక్‌, చైనా సంయుక్త సైనిక విన్యాసాలు మే 22వ తేదీన ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ విన్యాసాలు ఈ వారం చివ‌ర వ‌ర‌కు సాగ‌నున్నాయని ఆ కథనంలో పేర్కొన్నారు. 
 
నిజానికి చైనా, పాకిస్థాన్ అప్పుడ‌ప్పుడు సైనిక విన్యాసాలు నిర్వ‌హిస్తూనే ఉంటాయి. కానీ భార‌త్‌, చైనా మ‌ధ్య ఉన్న‌ ల‌డ్డాఖ్ ప్ర‌తిష్టంభ‌న‌కు ఏడాది పూర్తి కావ‌స్తున్న త‌రుణంలో ఈ విన్యాసాలు ప్ర‌త్యేకత‌ సంత‌రించుకున్నాయి. టిబెట్ శిక్ష‌ణ‌లో ఎంత మంది పాక్ సైనికులు ఉన్నారో స్ప‌ష్టంగా తెలియ‌దు. 
 
కానీ చైనా వైపు మాత్రం.. 3 ఎయిర్ డిఫెన్ డివిజ‌న్‌కు చెందిన ద‌ళాల‌న్నీ భాగ‌స్వామ్యమైనట్టు సమాచారం. సైనిక శిక్ష‌ణ‌లో పాకిస్థాన్ వినియోగిస్తున్న మిస్సైళ్లు ఇక నుంచి పీఎల్ఏ నేవీ ద‌ళంలోనూ క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. పాక్ యుద్ధ నౌక‌లు కూడా ఆ మిస్సైళ్లను మోసుకువేళ్లే చాన్సు ఉంది. దీని వ‌ల్ల స‌రిహ‌ద్దు వెంట భార‌తీయ పైలెట్లు, డ్రోన్లు, మిస్సైళ్లు స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు.