చైనాలో మనిషికి సోకిన మరో కొత్త వైరస్, ఆందోళనలో ప్రపంచం
సాధారణంగా బర్డ్‌ఫ్లూ వ్యాధి కోళ్ళకు సోకుతుంది. ఈ వైరస్ సోకి అనేక లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ సమయంలో చికెన్ అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోనే తొలిసారి బర్డ్‌ఫ్లూ తొలిసారి మనిషికి సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకడం ఇపుడు వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ సంఘటన కూడా చైనాలో వెలుగులోకి వచ్చింది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం ఉదయం ప్రకటించింది.
వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం అతడికి రక్త పరీక్షలు చేయగా బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించింది. అతడిలో హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని ప్రకటన రావడంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అతడు ఇటీవల ఎవరెవరిని కలిశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.