5జీ సేవలు వద్దు.. పర్యావరణానికి, మనుషులకు తీవ్రహాని.. కోర్టుకెక్కిన నటి జూహీ చావ్లా
దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో పలు చోట్ల 5జి నెట్‌వర్క్ సేవలను అందిస్తున్నారు. కొన్ని చోట్ల 5జి ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దేశంలోనూ త్వరలోనే 5జి సేవలను అందించనున్నారు. అందుకు గాను ఇటీవలే స్పెక్ట్రం వేలం కూడా నిర్వహించారు. దీంతో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు 5జి సేవలను అందించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
అందులో భాగంగానే వారు 5జి సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన హార్డ్‌వేర్‌ను, టవర్లను సమకూర్చుకుంటున్నారు. అయితే 5జి టెక్నాలజీ వల్ల పర్యావరణానికే కాక మనుషులకు తీవ్రమైన హాని కలుగుతుందని, కనుక 5జి రాకుండా ఆపాలని కోరుతూ ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.
5జి వల్ల పర్యావరణానికి విపరీతమైన హాని కలుగుతుందని జూహీ చావ్లా పేర్కొన్నారు. ఇంతకు ముందు వచ్చిన టెక్నాలజీల కన్నా 5జి టెక్నాలజీ వల్ల మరింత రేడియేషన్ పెరుగుతుందని, అది పిల్లలు, మహిళలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉందని తమ అధ్యయనాల్లో తేలిందని వివరించారు. అందువల్ల దేశంలో 5జి టెక్నాలజీ రాకుండా చూడాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
అయితే జూహీ చావ్లా వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సి.హరిశంకర్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును మరో బెంచ్‌కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్ 2వ తేదీ నాటికి కేసు విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలో ఆమె పిటిషన్‌పై కోర్టు ఏమని ఆదేశిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అయితే ఆమెకు ఇలా చేయడం కొత్తేమీ కాదు, గతంలోనూ ఆమె పర్యావరణ పరిరక్షణ నిమిత్తం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే తాజగా 5జి టెక్నాలజీని రాకుండా ఆపాలని పిటిషన్ వేశారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.