చైనాలో మరో భయంకరమైన వైరస్.. హెచ్10ఎన్3 మానవులకు ముప్పు తప్పదా?
చైనాలో ఇప్పుడు మరో భయంకరమైన వైరస్ వెలుగుచూసింది. దేశంలోని తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారినపడ్డాడు. మానవులకు సంక్రమించే బర్డ్‌ఫ్లూ కేసు నమోదు కావడంతో ప్రపంచంలోనే ఇది తొలిసారి.
బర్డ్ ఫ్లూ బారినపడిన వ్యక్తిలో 'హెచ్10ఎన్3 ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా' లక్షణాలను గుర్తించినట్టు చైనా జాతీయ హెల్త్ కమిషన్ తెలిపింది. బాధితుడు ఝెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి అని పేర్కొంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నాడని వివరించింది.
బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై చైనా వైద్యాధికారులు మాట్లాడుతూ తేలిగ్గా తీసిపడేశారు. పౌల్ట్రీ నుంచి మనుషులకు అప్పుడప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశాలు చాలా స్వల్పమని పేర్కొన్నారు. బాధితుడిలో హెచ్10ఎన్3 ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను మే 28న గుర్తించినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. అయితే, అతడు వైరస్‌కు ఎలా గురయ్యాడన్న విషయాన్ని వెల్లడించలేదు.
మానవుల్లో హెచ్10ఎన్1 స్ట్రెయిన్‌ను గుర్తించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. నిజానికి హెచ్10ఎన్3 అనేది తక్కువ వ్యాధికారకమని నిపుణులు చెబుతున్నారు. ఇది పెద్ద ఎత్తున వ్యాపించే ప్రమాదం తక్కువని పేర్కొన్నారు. చైనాలో ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజాకు సంబంధించిన అనేక రకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మానవులకు అరుదుగా సోకుతాయి. ముఖ్యంగా పౌల్ట్రీలలో పనిచేసే వారు దీని బారినపడే అవకాశం ఉంది.
ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌లో హెచ్5ఎన్8 అనేది ఉపరకం. దీనినే బర్డ్ ఫ్లూ వైరస్‌గా పిలుస్తారు. దీనివల్ల మానవులకు ముప్పు తక్కువ. అయితే, పక్షులు, పౌల్ట్రీలకు ఇది చాలా హానికారకం. ఏప్రిల్‌లో అత్యంత వ్యాధికారకమైన హెచ్5ఎన్6 ఎవియన్ ఫ్లూ చైనాలోని షెన్యాంగ్ నగరంలో పక్షుల్లో కనిపించింది.