మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జులై 2020 (09:57 IST)

టిక్ టాక్‌కు పాకిస్థాన్ వార్నింగ్!! వీడియోలు వడపోయాలంటూ హుకుం!

టిక్ టాక్‌కు దాయాది దేశం పాకిస్థాన్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తీరు మార్చుకోవాలంటూ హెచ్చరికలు చేసింది. లేనిపక్షంలో తమ దేశంలో కూడా నిషేధం విధించక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
గాల్వాన్ లోయ దాడి ఘటన తర్వాత టిక్ టాక్‌తో పాటు.. 59 రకాల యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. అలాగే, అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే బాటలో పయనించనుంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతకు టిక్ టాక్ వల్ల ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్‌కు కూడా ఇపుడు కనువిప్పు కలిగినట్టయింది. తీరు మార్చుకోవాలంటూ టిక్‌టాక్‌ను గట్టిగా హెచ్చరించింది. చైనాపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న పాక్‌.. ఆ దేశానికి చెందిన యాప్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడేంత సాహసించడం ఒక విధంగా అనూహ్య విషయమే. 
 
కాగా, ఇప్పటికే, సింగపూర్‌కు చెందిన లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం బిగో యాప్‌నైతే ఏకంగా నిషేధించింది. వాటి వీడియోల్లోని అసాంఘిక, అశ్లీల, అసభ్యకర పోస్టులు ఉంటున్నాయని.. ఇవి సమాజంపై, ముఖ్యంగా యువతపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని అక్కడి మానవ హక్కుల కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. 
 
పాక్ ప్రభుత్వానికి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళుతున్నాయి. దీంతో బిగో యాప్‌పై పాకిస్థాన్ నిషేధం విధించింది. ఇపుడు తమ దేశ చట్టాలకు అనుగుణంగా వీడియోలోని అంశాలను వడపోయాలని టిక్‌ టాక్‌కు పాకిస్థాన్ సూచన చేసింది. లేనిపక్షంలో కష్టాలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది.