శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 మే 2020 (20:48 IST)

కరోనా వైరస్ సోకి పాకిస్థాన్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే మృతి

పాకిస్థాన్ దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ.. ఆ దేశం మాత్రం వైరస్ వ్యాప్తికి తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. దీనికి భారీ మూల్యమే చెల్లించుకుంది. కరోనా వైరస్ సోకి అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చనిపోయారు. ఈ నెల 17వ తేదీన ఆస్పత్రిలో చేరిన ఆ ప్రజాప్రతినిధి 20వ తేదీన కన్నుమూశారు. ఆమె పేరు షహీన్ రాజా. వయసు 65 యేళ్లు. 
 
పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజా లాహోర్‌లో కరోనాతో పోరాడుతూ మరణించినట్టు మాయో ఆసుపత్రి సీఈవో డాక్టర్ అసద్ అస్లాం తెలిపారు. కరోనా బారిన పడిన రజాను ఈ నెల 17న ఆసుపత్రిలో చేర్చగా, సోమవారం మాయో ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని అస్లాం పేర్కొన్నారు.  
 
ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన రజా.. రిజర్వుడు సీటు నుంచి అసెంబ్లీకి ఎన్నికైనట్టు పంజాబ్ ఆరోగ్య మంత్రి యాస్మిన్ రషీద్ తెలిపారు. కేన్సర్ బారినపడి కోలుకున్న ఎమ్మెల్యే తరచూ ప్రావిన్స్‌లోని క్వారంటైన్ కేంద్రాలను సందర్శించేవారని ఆయన వివరించారు. 
 
మరోవైపు, పాకిస్థాన్ దేశంలో ఇప్పటివరకు 45,898 మంది కరోనా బారినపడగా, 985 మంది మరణించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆ దేశం మాత్రం నామమాత్రపు చర్యలే తీసుకుంటోంది. చివరకు వైద్యులకు పీపీఈ, ఎన్95 రకం మాస్కులు కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది.