విడాకులు కావాలంటే భార్యకు పరిహారంగా రూ.5.57 లక్షలు చెల్లించాలి...
కట్టుకున్న భార్య నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోరిన భర్తకు కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఇంతకాలం ఇంటిపని, వంట పని చేసినందుకు భార్యకు పరిహారంగా రూ.5.57 లక్షలు (7700 డాలర్లు) చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు చైనా కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ భర్త అవాక్కయ్యాడు.
ఇటీవల చైనా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం కింద విడాకుల సమయంలో భర్త నుంచి భార్య పరిహారం కోరేందుకు హక్కును కల్పించారు. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే కోర్టు ఇటువంటి తీర్పునిచ్చింది.
కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య నుంచి విడాకులు కావాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇదేసమయంలో భార్య కూడా కోర్టుకెక్కి ఐదేళ్ల పాటు తానొక్కదాన్నే ఓవైపు, కన్నబిడ్డను చూసుకుంటూ మరోపక్క ఇంటి పని మొత్తం చేస్తూ వచ్చానని తెలిపింది.
కోర్టు కూడా మహిళ వాదనను సమర్థిస్తూ కొత్త చట్టం కింద పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. కోర్టు ఇచ్చిన తీర్పును చాలా మంది సమర్థిస్తున్నారు. ఈ తీర్పుతో కోర్టు సరికొత్త మార్గానికి ఒక అడుగు వేసిందని ప్రశంసిస్తున్నారు. కానీ సదరు మహిళ చేసిన పనికి ఈ పరిహారం చాలా తక్కువని చెబుతున్నారు.