బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (10:13 IST)

భారత విమానాలపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్

భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం జూన్‌ 15వ తేదీ వరకు పొడగించింది. భార‌త్‌, పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఒమన్‌, యూఏఈ నుంచి ప్రయాణికులపై నిషేధం పొడగించినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సోమవారం పేర్కొంది. 
 
కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసు మేరకు ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను పొడగించేందుకు అధ్యక్షుడు రోడ్రిగో ఆమోదం తెలిపారని ఆయన ప్రతినిధి హ్యారీ రోక్ చెప్పారు.
 
భారత్‌లో తొలిసారిగా గుర్తించిన బి.1.617 డబుల్‌ మ్యూటెంట్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఇంతకుముందు ఏప్రిల్‌ 31 నుంచి మే 31 వరకు ఏడు దేశాలపై ఫిలిప్పీన్స్ నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు బ్యాన్‌ను పొడగించింది. 
 
ఇదిలావుండగా, ఫిలిప్పీన్స్‌లో నిన్న 6,684 కరోనా కేసులు రికార్డయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 12,30,301కు చేరుకుంది. వైరల్ వ్యాధితో మరో 107 మంది రోగులు మరణించడంతో.. మృతుల సంఖ్య 20,966కు పెరిగింది.