ట్రంప్‌కు విషం పార్శిల్.. వైట్ హౌస్ లో కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసమైన వైట్ హౌస్ కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన ఓ పార్శిల్‌ను పంపించారు. దీన్ని తనిఖీ కేంద్రంలోనే గుర్తించిన అధికారులు అక్కడే నిలిపివేశారు. ప్రాథమిక నిర్థారణ పరీక్షల్లో అది రిసిన్ అనే విష పదార్థం అని తేలినట్లు సమాచారం.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అనుమానిత కవర్ ఒకటి ట్రంప్ పేరిట వచ్చిందని.. దానిపై దర్యాప్తు కొనసాగుతుందని మాత్రం దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ), సీక్రెట్ సర్వీస్, యూఎస్ పోస్టల్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ కలిపి సంయుక్తంగా దీనిపై విచారణ జరుపుతున్నాయి.
గతంలోనూ ఈ తరహాలో శ్వేతసౌధం చిరునామాతో లేఖలు వచ్చాయి. 2018లో మాజీ నేవీ అధికారి ఒకరు రిసిన్ తో కూడిన ఓ లేఖను ట్రంప్‌నకు పంపారు. దీన్ని ముందుగానే గుర్తించి నిందితుణ్ని అరెస్టు చేశారు. 2014 లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మిస్సిసిపీ కి చెందిన ఓ అధికారి రిసిన్ తో రుద్దిన లేఖను పంపారు.
అధికారులు దాన్ని ముందుగానే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. ఇలా పలువురు ఫెడరల్ అధికారులకు కూడా గతంలో విషంతో కూడిన లేఖలు వచ్చాయి.
రిసిన్ ఆముదపు గింజల్లో సహజంగా నిక్షిప్తమై ఉంటుంది. కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా దీన్ని గింజల నుండి వెలికితీస్తారు. సాధారణంగా ఆముదపు గింజల్ని శుద్ధి చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల నుండి రిసిన్ ను తయారు చేస్తారు.
దీనికి ఎక్స్‌పోజ్ అయిన 36 నుంచి 72 గంటల్లో మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పటి వరకు దీనికి విరుగుడు మందు లేకపోవడం గమనార్హం.