మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (14:59 IST)

మంత్రివర్గాన్ని ప్రకటించిన జో బైడెన్... రక్షణ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి దేశ 46వ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్న డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ఇపుడు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఇందులో తనకు సహచరులుగా ఉన్న పలువురిని కేబినెట్లోకి తీసుకున్నారు. అత్యంత కీలకమైన విదేశాంగశాఖ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్‌ను ప్రకటించారు. 
 
నల్ల సూరీడు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్లింకెన్ విదేశాంగశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. మరోవైపు బ్లింకెన్ విదేశాంగశాఖ మంత్రి కావడం భారత్‌కు శుభవార్త అని, చైనా, పాకిస్థాన్‌లకు చేదు వార్తేనని అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దీనికి బలమైన కారణాలు లేకపోలేదు. గత జూలై 9న వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్లింకెన్ మాట్లాడుతూ, ఇండియాతో ఉన్న బంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు. ఇండో - పసిఫిక్ ప్రాంత భవిష్యత్తు దృష్ట్యా ఇండియాతో బంధం చాలా ముఖ్యమన్నారు. క్లింటన్, జార్జ్ బుష్, ఒబామాలు కూడా భారత్‌తో అనుబంధానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని గుర్తుచేశారు.
 
ముఖ్యంగా, జార్జి బుష్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు భారత్‌తో జరిగిన శాంతియుత అణు సహకార ఒప్పందం వెనుక అప్పటి సెనేటర్ బైడెన్ కూడా ఉన్నారని బ్లింకెన్ అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండియాను ఒక మేజర్ రక్షణ భాగస్వామిగా చూశారని చెప్పారు. 
 
అలాగే, గత ఆగస్ట్ 15న ఇండో-యూఎస్ సంబంధాలపై ఒక ప్యానల్ మీటింగ్‌లో బ్లింకెన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థలలో ఇండియా మరింత మెరుగైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం లభించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు.
 
ఇదే మీటింగ్‌లో చైనాపై బ్లింకెన్ విమర్శలు గుప్పించారు. చైనాతో అమెరికాకు, ఇండియాకు దాదాపు ఒకే విధమైన సమస్యలు ఉన్నాయన్నారు. ఇండియా విషయంలో వాస్తవాధీన రేఖ వద్ద చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చైనా ఆర్థిక విధానాలు ఇతర దేశాలకు నష్టం కలిగించేలా ఉన్నాయని దుయ్యబట్టారు. 
 
టెర్రరిజంపై బ్లింకెన్ మాట్లాడుతూ... ఇండియా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. టెర్రరిజంను ఇండియా ఎదుర్కొనే విషయంలో కూడా సహకరిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, బ్లింకెన్ యూఎస్ విదేశాంగ మంత్రి అయితే ఇండియాకు ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు చెపుతున్నారు.