గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (11:08 IST)

హిందూ మందిర్‌పై ఖలిస్థానీ సభ్యుల దాడి... ఖండించిన కెనడ్ ప్రధాని

canada hindu temple
కెనడాలో మరోమారు ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్ వద్ద మహిళలు, పిల్లలు, సహా భక్తులపై భౌతికదాడికి తెగబడ్డారు. ఆలయం వెలుపల ఉన్న భక్తులపై కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టుకుని దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలు ఇపుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 
 
మరోవైపు, ఈ దాడికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. దేశంలో హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఆదివారం నాడు హిందూ సభ మందిర్‌లోని భక్తులపై ఖలీస్థానీ మద్దతుదారులు దాడి చేయడం అమానుషం అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రూడో ఈ దాడిని ఖండిస్తూ పోస్ట్ చేశారు. 
 
బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌లో జరిగిన హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యంకాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. ఈ సంఘటనపై త్వరగా స్పందించి బాధితులను కాపాడినందుకు పీల్ ప్రాంత పోలీసులకు ధన్యవాదాలు. అంతేకాకుండా, వేగంగా దర్యాప్తు చేయడం ప్రశంసనీయం అని ట్రూడో తన పోస్టులో పేర్కొన్నారు. అలాగే, కెనడాలోని హిందూ సంఘాలు కూడా ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.