శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (22:14 IST)

పాకిస్థాన్‌లో ఘర్షణ.. 11 మంది మృతి.. 15మందికి గాయాలు

వాయవ్య పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతంలో వివాదాస్పద అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడంపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కుర్రం జిల్లాలోని కోహట్ డివిజన్‌లో షియా-సున్నీ మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 11 మంది మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వివాదాస్పద పర్వత అడవుల్లో చెట్లను నరికివేసే విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 
 
ఈ సందర్భంగా భారీ ఆయుధాలు ప్రయోగించగా, నిన్నటి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శాంతి, భద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది. సున్నీ, షియా వర్గాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణలతో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు తప్పేలా లేవు.
 
నానాటికి పెరిగిపోతున్న మతపరమైన హింసను పాకిస్తాన్‌ ఎదుర్కొంటున్నందున.. అల్-ఖైదా, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న సాయుధ సున్నీ గ్రూపులు.. దేశ జనాభాలో 20 శాతంగా ఉన్న షియా గ్రూపులపై తరచుగా దాడులకు పాల్పడుతున్నాయి. 
 
మరోవైపు, నిషేధిత రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లొంగిపోయినట్లుగా కనిపిస్తుంది. తమ వారిని విడుదల చేయనిపక్షంలో టీఎల్‌పీ కార్యకర్తలు ఇస్లామాబాద్ వైపు వెళ్తారని తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ హెచ్చరించింది. 
 
వీరి ఒత్తిడి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం 350 మందికి పైగా తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ కార్యకర్తలను విడుదల చేసింది. మిగిలిన కార్యకర్తలపై బుధవారం నాటికి కేసులను ఉపసంహరించుకుంటామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.