శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:40 IST)

స్పైయింగ్ : పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాను అరెస్టు

గుజరాత్ రాష్ట్రంలోని భుజ్‌లో భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)లో పనిచేస్తూ, శత్రు దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా మారిన ఓ ఉద్యోగిని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన మహమ్మద్‌ సాజిద్‌ అనే వ్యక్తి పదేళ్ల క్రితం 74 బీఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. 
 
ప్రస్తుతం గుజరాత్‌లోని భుజ్‌లో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా వాట్సాప్‌ ద్వారా పాక్‌కు రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడు. అందుకు ప్రతిఫలంగా అతని సోదరుడు వాజిద్, సహచరుడు ఇక్బాల్‌ రషీద్‌ల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నట్టు ఏటీఎస్‌ గుర్తించింది. 
 
2011, 2012 సంవత్సరాలలో సాజిద్‌ 46 రోజుల పాటు పాక్‌లో గడిపినట్టు అతని పాస్‌పోర్టు ద్వారా బయటపడింది. బీఎస్‌ఎఫ్‌లో నమోదైన సాజిద్‌ పుట్టిన రోజు కూడా తప్పేనని తేలింది. ఈ ఆధారాలు సేకరించిన ఏటీఎస్‌ పోలీసులు.. భుజ్‌లోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అతన్నుంచి రెండు ఫోన్లు, ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్న సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.