సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (12:07 IST)

టీడీపీ నేత పట్టాభి మరోసారి అరెస్టు

తెలుగుదేశం పార్టీ  పట్టాభిని ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బోషడికే అన్నందుకు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరిలించారు. అయితే, ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం సాయంత్రం టీడీపీ నేత పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. 
 
అయితే, ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో పోలీసులు మరోసారి అరెస్టు చేశారన్న ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. శనివారం విడుదలైన పట్టాభి ఇంతవరకూ ఇంటికి రాకపోవడంతో.. పోలీసులే అరెస్టు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తానున్న వాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి జైలు నుంచి పట్టాభి విజయవాడకు బయల్దేరారు.
 
అయితే పొట్టిపాడు టోల్ గేట్ వద్దకు చేరుకోగానే పోలీసులను భారీగా మోహరించారు. పట్టాభి కారుతో పాటు మరో రెండు వాహనాలనే అనుమతించారు. మిగతా వాహనాలను అక్కడే ఆపేశారు. దీంతో పట్టాభిని మరోసారి అరెస్ట్ చేస్తున్నారన్న ప్రచారం దావానలంలా వ్యాపించింది. విజయనగరం జిల్లాలో నమోదైన కేసులో పట్టాభిని ఇంకోసారి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది.
 
తనను పోలీసులు మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని అంతకుముందే తెదేపా నేతల వద్ద పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. తాము పట్టాభిని అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ఆయన తనంతట తానే వెళ్లిపోయారని, తమకేం సంబంధం లేదని చెప్పారు. పట్టాభి సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారని టీడీపీ నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.