1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:06 IST)

ఆప్ఘనిస్థాన్‌పై రాకెట్ దాడులకు పాల్పడిన పాకిస్థాన్

Afghanistan
ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమైన కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాకిస్థాన్ సైన్యం రాకెట్ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని ప్రాంతీయ సమాచారం సంచాలకులు నజీబుల్లా హసన్ అబ్దాల్ వెల్లడించారు. 
 
ఈ దాడి నేపథ్యంలో తాలిబాన్ అధికారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గత సంవత్సరం ఆఫ్గనిస్థాన్‌ను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుండి పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. ఆఫ్గన్ ప్రాంతం నుంచి మిలిటెంట్ గ్రూపులు తమ దేశంపై దాడికి యత్నిస్తున్నాయని పాకిస్థాన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ప్రధానంగా పాకిస్థానీ తీవ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం ఇవ్వడాన్ని పాక్ తప్పబడుతుంది. దీనికితోడు పాకిస్థాన్, ఆప్గాన్ దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని ఆక్రమించుకొనేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలొంటున్నాయి.