ఆ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు ఢీకొనడం కారణం కాదా?
ఇటీవల అజర్‌బైజాన్‌కు చెందిన విమానం ఒకటి కజకిస్థాన్‌లో కూలిపోయింది. పక్షుల గుంపు ఢీకొనడం వల్ల ఈ విమానం కూలిపోయినట్టు వెల్లడించారు. అయితే, ఈ విమాన ప్రమాదంపై చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విమాన ప్రమాదానికి పక్షుల గుంపు కారణం కాదని తెలుస్తుంది. ఉక్రెయిన్ - రష్యాల మధ్య గత కొంతకాలంగా యుద్ధం సాగుతుంది. ఉక్రెయిన్ సైన్య రష్యాపై డ్రోన్‌లతో విరుచుకుపడుతుంది. దీంతో ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్ డ్రోన్‌గా భావించి రష్యా మిలిటరీ కాల్పులు జరపడం వల్లే ఈ విమానం కూలిపోయిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విమానం వెనుకభాగంలో కనిపిస్తున్న రంధ్రాలు తూటాలు దూసుకెళ్లడం వల్ల పడినవేనన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. విమానం కూలిపోవడానికి ముందు లోపల ఒకరు తీసిన వీడియోలో ఓ మహిళ కాలికి గాయమైన దృశ్యాలు, క్యాబిన్ వాల్‌పై కనిపించిన రంధ్రాలు కూడా ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు అజర్‌బైజాన్ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభిం చింది.
కాగా, రష్యా గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున కాల్పులు జరపడం వల్లే విమానం కూలిపోయిందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది. దర్యాప్తు పూర్తయితే అసలు కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి సూచించారు. బుధవారం అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆ దేశ రాజధాని బాకూ నుంచి రష్యాలోని గ్రోజ్నీ నగరానికి వెళుతుండగా కజికిస్థాన్‌లో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 38 మంది ప్రయాణికులు మరణించారు. మిగతా 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. విమానం పక్షులను ఢీకొట్టిన తర్వాత అత్యవరసర పరిస్థితి తలెత్తిందని, దాంతో కజికిస్థాన్‌లోని ఆక్టె విమానాశ్రయంలో దింపే ప్రయత్నంలో కూలిపోయిందన్నది ప్రాథమిక సమాచారం.