గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (11:15 IST)

డోనాల్డ్ ట్రంప్‌పై మరోమారు కాల్పులు... తృటిలో తప్పిన ప్రాణాపాయం!!

donald trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న మాజీ అధినేత డోనాల్డ్ ట్రంప్ సమీపంలో మరోమారు కాల్పులు జరిగాయి. అయితే, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన సమీపంలో కాల్పులు జరగడంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.. ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. 
 
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. 
 
ట్రంప్‌నకు గోల్ఫ్ ఆడే అలవాటు ఉంది. అప్పుడప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్న భోజనానికి ముందు వరకు వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో గడుపుతారు. ఎన్నికల ప్రచారం మగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన.. ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఓ ఎస్‌యూవీలో పారిపోయాడని, పోలీసులు తెలిపారు.
 
మరోవైపు, ఈ కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్‌కు అధికారుల సమాచారం అందించారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కాల్పులు ఘటనపై ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తాను ట్రంప్‌తో మాట్లాడానని, తను క్షేమంగానే ఉన్నాడన్నారు. తాను చూసిన వక్తుల్లో ఆయన చాలా బలవంతుడన్నారు.