శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (09:38 IST)

సౌదీలో మరో సంస్కరణ : మైనర్లకు ఉరిశిక్షలు రద్దు

సౌదీ అరేబియా రాజు సల్మాన్ పాలనలో అనేక కీలక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇటీవలే వివిధ నేరాలకు పాల్పడేవారికి విధించే కొరడా దెబ్బల శిక్షలను రద్దు చేశారు. దీనికి ఆ దేశ సుప్రంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. ఇపుడు వివిధ నేరాలకు పాల్పడే మైనర్లకు విధించే ఉరిశిక్షలను రద్దు చేశారు. ఈ మేరకు సౌదీ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ముస్లిం చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఈ దేశంలో చిన్న తప్పు చేసినా కఠిన శిక్షలు అమలు చేస్తుంటారు. ఈ శిక్షల అమలుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా, శిక్షల అమలు పేరుతో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పలు సంస్థలు ఆరోపిస్తూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో సౌదీ రాజు పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, తీవ్రమైన నేరాల్లో మైనర్లకు అమలు అవుతున్న మరణశిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాజు ఉత్తర్వులు జారీ చేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక జైల్లో మగ్గుతున్న వారిలో పదేళ్ల శిక్షను పూర్తి చేసుకున్న వారి కేసులను సమీక్షించి, వారి శిక్షా కాలాన్ని తగ్గించడం కానీ విడుదల చేయడం కానీ చేయాలని రాజు ఆదేశించారు.
 
కాగా, మైనర్లకు మరణదండన రద్దు కావడంతో, షియా వర్గానికి చెందిన ఆరుగురు మృత్యువును తప్పించుకున్నారు. ఇస్లామిక్ చట్టాలకు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే రాజు ఇటీవలి నిర్ణయాల వెనుక ఆయన కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. సౌదీలో ఇంకా సంస్కరణవాదులపైనా, మహిళా హక్కుల కార్యకర్తలపైనా అణచివేత ధోరణి కొనసాగుతూనే ఉంది. దీనిపైనా రాజు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.