కరెంట్ బిల్లు చూసి నోట మాటరాలేదు... ఎందుకని?
యాప్ ఓపెన్ చేయగానే కరెంటు బిల్లు చూసిన వ్యక్తికి నోట మాటరాలేదు. తాను ఇంత కరెంటు బిల్లు ఎప్పుడూ చూడలేదని, అయినా ఇంత కరెంటు బిల్లు రావడానికి కారణమేమిటని ట్విట్టర్ ద్వారా కంపెనీని అడిగాడు.
ప్రతి నెలా మాదిరిగానే ఈ నెల కూడా టామీ స్ట్రాబ్ అనే వ్యక్తి కరెంటు బిల్లును ఆన్‌లైన్‌లో కట్టాలనుకున్నాడు. కరెంట్ బిల్ యాప్ ఓపెన్ చేయగానే విస్తుపోయాడు. ఒకటి రెండు రూపాయలు కాదు 38 మిలియన్ డాలర్లు (దాదాపు 264 కోట్లా 36 లక్షల రూపాయలు) కట్టాలని చూపింది. దాంతో ఏమి చేయాలో అర్థం కాక వెంటనే ట్విట్టర్ ద్వారా కరెంట్ బిల్ కంపెనీని సంప్రదించాడు.
తాను 600 చదరపు అడుగుల స్టూడియోను నడుపుకుంటున్నానని, తనకు వచ్చిన బిల్లు కేవలం 77 డాలర్లు(రూ.5300) అని తెలిపాడు. కాని యాప్ ఎందుకు ఇంత చూపిందని ప్రశ్నించాడు. వెంటనే కంపెనీ సిబ్బంది స్పందించారు. జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నామని హామీ ఇచ్చింది. కొద్ది సేపటి తర్వాత మళ్లీ యాప్ తెరిచి చూడగా 77 డాలర్లు కనిపించింది. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ నెటిజన్లు మాత్రం దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పొరపాటు తమవైపు ఉన్నా కంపెనీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.