వృత్తి నిపుణులకు తాలిబన్ల వేడికోలు
దేశం విడిచి వెళ్లిపోవద్దని నిపుణులైన ఆఫ్ఘన్లను తాలిబన్ వేడుకుంది. ఇంజనీర్లు, డాక్టర్లు వంటి ఆఫ్ఘన్ వృత్తి నిపుణులను కాబూల్ నుండి తీసుకెళ్ళడాన్ని ఆపాలని అమెరికాను కోరింది.
మరోవైపు గడువులోగా తరలింపును పూర్తి చేయాల్సి వున్న అమెరికా బలగాలు పలువురు ఆఫ్ఘన్లతో సహా వేలాదిమందిని అక్కడ నుండి తరలిస్తున్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తున్న ఆఫ్ఘన్ల కోసం ఇప్పటికే మూడు మిలటరీ స్థావరాలను ఏర్పాటు చేసిన అమెరికా 4వ స్థావరాన్ని న్యూ జెర్సీలో ఏర్పాటు చేసినట్లు పెంటగన్ తెలిపింది.
ఇప్పటివరకు మొత్తంగా 58 వేల మందికి పైగా తరలించడానికి అమెరికా చర్యలు తీసుకుంది. 'ఈ దేశానికి వారి నైపుణ్యాలు అవసరం. వారిని ఇతర దేశాలకు తీసుకెళ్ళొద్దు' అని తాలిబన్ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ మీడియా సమావేశంలో వేడుకున్నారు.
'అమెరికా, నాటో బలగాలకు విమానాలు వున్నాయి. విమానాశ్రయం వుంది. ఇక్కడ నుండి వారి పౌరులను, కాంట్రాక్టర్లను మాత్రమే తీసుకెళ్ళాలి' అని ముజాహిద్ పేర్కొన్నారు. విదేశీ బలగాల ఉప సంహరణకు ప్రస్తుతమున్న ఆగస్టు 31 గడువును పొడిగించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.