మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 ఆగస్టు 2025 (15:39 IST)

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

donald trump
తమ దేశంలోని అక్రమ వలసలను అరికట్టేందుకు సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. పర్యాటక (బీ2), స్వల్పకాలిక వ్యాపార (బి1) వీసాలపై అమెరికాకు వచ్చే వారి కోసం ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు. 
 
ఈ నిబంధన మేరకు... కొందరు దరఖాస్తుదారులు వీసా పొందాలంటే 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల (సుమారు రూ.4 లక్షల నుంచి రూ.12.5 లక్షల) వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేయనున్నారు. 
 
అక్రమ వలసలను అరికట్టడంతో పాటు, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ పైలట్ ప్రోగ్రాము రూపొందించారు. ఈ నిబంధనలను ఆగస్టు 5న ఫెడరల్ రిజిస్టరులో అధికారికంగా ప్రకటించి, 15 రోజుల తర్వాత అమలులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది. 
 
అయితే, ఈ బాండ్ విధానం అన్ని దేశాల వారికి వర్తించదు. ఏయే దేశాల్లో వీసా నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, ఆయా దేశాల జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని బట్టి బాండ్ అవసరమా? లేదా? అనేది కాన్సులర్ అధికారులు నిర్ణయిస్తారు. బాండ్ మొత్తాన్ని కూడా వారే నిర్ధారిస్తారు. వీసా మినహాయింపు కార్యక్రమం (వీసా వేవర్ ప్రోగ్రామ్) కింద ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.