ఆప్ఘనిస్థాన్‌కు గట్టివార్నింగ్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్
ఆప్ఘనిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆప్ఘన్‌లోని కీలకమైన బగ్రాం ఎయిర్ బేస్‌ను తమకు అప్పగించాలంటూ హెచ్చరిక చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆప్ఘన్ ప్రభుత్వం కూడా అంతే ధీటుగా స్పందించింది. దీంతో ఒకప్పుడు అమెరికాకు ప్రధాన సైనిక స్థావరంగా ఉన్న ఈ ఎయిర్ బేస్‌పై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది.
తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. "బగ్రాం ఎయిర్ బేస్‌ను నిర్మించిన అమెరికాకు ఆఫ్ఘనిస్థాన్ తిరిగి అప్పగించకపోతే, తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఇప్పటికే ఆప్ఘన్‌తో చర్చలు జరుపుతున్నామని ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్థాన్ తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోమని తాలిబన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలీ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో అండ్ టెలివిజన్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (ఆర్టీఏ) ప్రసారం చేసింది.
"చరిత్రలో ఎన్నడూ ఆఫ్ఘన్లు తమ భూమిపై విదేశీ సైనిక ఉనికిని అంగీకరించలేదు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగించాలి" అని జలాలీ పేర్కొన్నట్లు మీడియా తెలిపింది.
కాబూల్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బగ్రాం ఎయిర్ బేస్, 20 ఏళ్ల పాటు ఆఫ్ఘన్‌లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు ప్రధాన సైనిక స్థావరంగా పనిచేసింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఇది అమెరికాకు కీలక కార్యకలాపాల కేంద్రంగా ఉండేది. 2021 ఆగస్టులో అమెరికా దళాలు వైదొలగిన తర్వాత ఈ స్థావరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ ఈ స్థావరాన్ని వదులుకోవడంపై ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు.