బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (11:58 IST)

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం : గాల్లో కలిసి ముగ్గురి ప్రాణాలు

Gun
Gun
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం జరిగింది. లాస్ ఏంజెలెస్ నగరంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఓ పార్టీలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
 
లాస్ ఏంజెలెస్ పోలీస్ డిపార్టుమెంట్‌ (ఎలపీడీ) తెలిపిన వివరాల ప్రకారం, డౌన్‌టౌన్ లాస్ ఏంజెలెస్‌లోని 14వ ప్లేస్, పలోమా స్ట్రీట్ సమీపంలోని ఓ గిడ్డంగిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారాంతంలో జరిగిన 'హార్డ్ సమ్మర్' మ్యూజిక్ ఫెస్టివల్ అనంతరం ఈ ఆఫ్టర్ పార్టీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో పార్టీలో కాల్పులు జరిగినట్టు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
ఆసక్తికరంగా, కాల్పులు జరగడానికి కొన్ని గంటల ముందే, అంటే ఆదివారం రాత్రి 11 గంటల సమయంలోనే పోలీసులు ఈ పార్టీ జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. అనుమతి లేకుండా 50 మందికి పైగా పార్టీ చేసుకుంటున్నారని గమనించి, ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో తుపాకీ కలిగి ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసి, పార్టీని ఖాళీ చేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, వారు వెళ్లిన కొద్ది గంటలకే అదే ప్రదేశంలో ఈ దారుణం జరిగింది.
 
ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తుపాకీ గాయాలతో పడి ఉన్న 8 మందిని గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, 52 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బాధితుల వయసు 26 నుంచి 62 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.