యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ - యేడాది పాటు పెయిడ్ లీవ్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక యేడాది పాటు ఉచితంగా వేతనం అందించనుంది. పెయిడ్ లీవ్ పేరుతో ఈ జీతం అందజేస్తారు. ఆ దేశ పాలకులు ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం లేకపోలేదు.
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాపారం చేయాలని కల, కోరిక ఉంటుంది. అలాంటి వారు ధైర్యం చేసి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారంలోకి దిగి నష్టపోతే... రెండు విధాలుగా మునిగిపోతామనే భయం వెంటాడుతుంది. అందుకే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వ్యాపారం చేసేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని సాహసం చేయరు.
ఇలాంటి వారి కోసమే యూఏఈ పాలకు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే ఒక యేడాది పాటు పెయిడ్ లీవ్ ఇస్తామని, ఈ యేడాదిలో వ్యాపారం చేయాలన్న మీ కలను నెరవేర్చుకోవాలని సూచించింది. ఒక వేళ వ్యాపారంలో క్లిక్ అయితే సరేసరి... లేదంటే తిరిగి ఉద్యోగంలో చేరవచ్చని తెలిపింది.
ఒక యేడాది పాటు సెలవు పెట్టినప్పటికీ నెల నెలా సగం జీతం ఇస్తామని యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఈ సెలవులను వినియోగించుకోవాలని భావించే ప్రభుత్వ ఉద్యోగి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. కాగా, ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో పని రోజులను కూడా నాలుగున్న రోజుకే కుదిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.