శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (10:00 IST)

మా శక్తితో పోలిస్తే మీరేపాటి?.. సద్దాం, గడాఫీలకు పట్టిన గతేపడుతుంది..

ఉత్తర కొరియాకు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మీడియా గట్టిహెచ్చరిక చేసింది. వరుసగా క్షిపణి పరీక్షలకు పాల్పడుతూ, నిత్యమూ రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆ దేశాధ్యక్

ఉత్తర కొరియాకు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన మీడియా గట్టిహెచ్చరిక చేసింది. వరుసగా క్షిపణి పరీక్షలకు పాల్పడుతూ, నిత్యమూ రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను ఎలాగైనా అదుపు చేయాలని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అమెరికా మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
తమ దేశాభివృద్ధి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే సాధ్యమైందని, ఉత్తర కొరియా వంటి దేశాలు తమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగి సత్ఫలితాలు సాధించాలే తప్ప, దాడులకు తెగబడతామంటే, సాధించేది ఏమీ ఉండబోదని వ్యాఖ్యానించింది. 
 
ఒక హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో ఏదో సాధించామని అనుకుంటే పొరపాటని, అమెరికా వద్ద అంతకు ఎన్నో రెట్లు అధిక శక్తిమంతమైన బాంబులున్నాయని, వాటితో పోలిస్తే, కిమ్ వద్ద ఉన్న అణ్వస్త్రాలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, బరితెగిస్తే మాత్రం సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే పడుతుందని యుఎస్ మీడియా హెచ్చరించింది. 
 
ఇదిలావుండగా, ఉత్తర కొరియా మరోమారు రెచ్చిపోయింది. అమెరికా, ఐరాస హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున మరో క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. అది జపాన్ మీదుగా ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడింది. కాగా, ఈ నెలలో ఇది రెండో క్షిపణి ప్రయోగం. మూడు వారాల క్రితం కూడా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. కిమ్ జోంగ్ తాజా చర్యతో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.