సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (15:53 IST)

భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. ఎందుకు.. ఏ విషయంలో?

అగ్రరాజ్యం అమెరికాలో కొత్త సంవత్సరంలో అధికార మార్పిడి చోటుచేసుకోనుంది. ఆ దేశ 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధినేత డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. దీంతో వచ్చే నెల 20వ తేదీన అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ ప్రమాణం చేయనున్నారు. 
 
ఈ ప్రమాణోత్సవ కార్యక్రమానికి కొన్నిరోజులే ఉండగా, భారత్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ర‌ష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని భార‌త్‌తోపాటు ఇత‌ర దేశాల‌ను హెచ్చ‌రించింది. ఇప్పటికే ర‌ష్యా నుంచి ఎస్‌400 ట్రింఫ్ యాటీ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను కొనుగోలు చేసిన ట‌ర్కీపై ఆంక్ష‌లు విధించింది. 
 
అమెరికాస్ అడ్వ‌ర్స‌రీస్ త్రూ సాంక్ష‌న్స్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ) కింద ట‌ర్కీపై ప‌లు ఆంక్ష‌లు విధించిన‌ట్లు ఇంట‌ర్నేష‌ల్ సెక్యూరిటీ అండ్ నాన్‌ప్రోలిఫ‌రేష‌న్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ క్రిస్టోఫ‌ర్ ఫోర్డ్ వెల్లడించారు. అలాగే, అన్ని దేశాలు గుర్తించి ర‌ష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్ల‌ను నిలిపేయాల‌ని, లేదంటే సీఏఏటీఎస్ఏ సెక్ష‌న్ 231 కింద ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని ఫోర్డ్ హెచ్చ‌రించారు. 
 
అలాగే, భారత్ కూడా 2018లో ఐదు ఎస్‌400 యాంటీ మిస్సైల్ వ్య‌వ‌స్థల‌ కోసం 543 కోట్ల డాల‌ర్ల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ను అమెరికా వ్య‌తిరేకిస్తున్నా.. ఆంక్ష‌లు విధిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నా.. భార‌త ప్ర‌భుత్వం మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. 
 
మ‌రోవైపు అమెరికా కూడా భారత్‌కు ఆయుధాల‌ను విక్ర‌యిస్తూనే ఉంది. గ‌తేడాది భారత్‌కు వ‌చ్చిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. 350 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 24 సికోర్క్సీ ఎంహెచ్‌-60ఆర్ సీ హాక్ హెలికాప్ట‌ర్లు, ఆరు బోయింగ్ ఏహెచ్‌-64ఈ అపాచీ గార్డియ‌న్ అటాక్ హెలికాప్ట‌ర్ల‌ను భార‌త్‌కు అమెరికా విక్ర‌యించ‌నుంది.